“కోడలు సర్పంచ్ కాగానే అత్తగారు చేసిన పని చూడండి!” ఏకంగా రూ. 20 లక్షల విలువైన భూమిని దానం చేసిన అత్తగారా? ఆశ్చర్యంలో గ్రామస్తులు.!

రాజస్థాన్ రాష్ట్రం భిల్వారా జిల్లాలోని అగేపురా గ్రామంలో అత్తాకోడళ్లు చేసిన ఓ పని పలువురి దృష్టిని ఆకర్షించడంతో పాటు ప్రశంసలు అందుకుంటోంది.

కొత్తగా ఎన్నికైన కోడలు రతన్‌దేవి భవాని జాట్ గ్రామ సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో, గ్రామాభివృద్ధి కోసం ఆ కుటుంబం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా, ఆమె 85 ఏళ్ల అత్తగారు రాంప్యారి దేవి పంచాయతీ భవన నిర్మాణం కోసం సుమారు రూ. 20 లక్షల విలువైన భూమిని విరాళంగా ఇచ్చారు.

గత 2025లో రాజస్థాన్ ప్రభుత్వం అగేపురా గ్రామానికి కొత్తగా పంచాయతీ హోదా కల్పించింది. అయితే, కొత్త పంచాయతీకి ప్రత్యేకంగా కార్యాలయ భవనం లేకపోవడంతో పరిపాలనా పనులు చేపట్టడంలో, గ్రామసభలు నిర్వహించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన రతన్‌దేవి దీనికి పరిష్కారం చూపాలని భావించారు. ఈ క్రమంలో పంచాయతీ భవన నిర్మాణానికి అవసరమైన భూమిపై తన కుటుంబ సభ్యులతో ఆమె చర్చించారు.

దీంతో రతన్‌దేవి భర్త భవాని జాట్, ఇతర కుటుంబ సభ్యులంతా తమ సొంత భూమిని పంచాయతీకి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయానికి కుటుంబంలో పెద్ద దిక్కు అయిన 85 ఏళ్ల రాంప్యారి దేవి కూడా అంగీకరించారు. తన పేరిట ఉన్న మొత్తం మూడున్నర బిగాల (Bigha) భూమిలో.. సుమారు ఒకటింపావు బిగాల భూమిని పంచాయతీ పేరిట దానంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. ఈ భూమి మార్కెట్ విలువ సుమారు రూ. 20 లక్షలు ఉంటుందని సమాచారం.

అత్తగారు తీసుకున్న ఈ నిర్ణయంతో అగేపురా గ్రామంలో కొత్త పంచాయతీ భవన నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. త్వరలోనే అక్కడ నూతన భవన నిర్మాణ పనులు చేపట్టనున్నారు. కోడలు సర్పంచ్ అయిన నేపథ్యంలో, గ్రామం మేలు కోసం ఆ కుటుంబం తమ సొంత భూమినే ఇవ్వడం స్థానికులలో సంతోషాన్ని నింపింది. అత్తాకోడళ్లు తీసుకున్న ఈ చొరవ ప్రస్తుతం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.


Posted

in

by

Tags: