నవంబర్ 1 నుంచి ప్రజల దైనందిన జీవితానికి సంబంధించిన పలు సేవల్లో మార్పులు రానున్నట్లు సమాచారం.
క్రెడిట్ కార్డ్ బిల్లులు, వంట గ్యాస్ సిలిండర్ ధర, యూపీఐ లావాదేవీలు, ఫోన్ కాల్స్‌లో పేరు చూపే సదుపాయం తదితర అంశాలు ఇందులో ప్రధానమైనవి. ముఖ్యంగా, విద్యుత్ తదితర యుటిలిటీ బిల్లులను క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించినప్పుడు, నిర్దిష్ట పరిమితిని దాటితే 1 శాతం అదనపు ఛార్జీ విధించే అవకాశం ఉందని, అలాగే రివార్డ్ పాయింట్ల నిబంధనల్లో కూడా మార్పులు ఉంటాయని తెలుస్తోంది.
అదేవిధంగా, గృహోపయోగ వంట గ్యాస్ సబ్సిడీని పొందేందుకు అక్టోబర్ 1 నుంచే ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ విధానం అమలులో ఉందని, ఈ ప్రక్రియను పూర్తి చేయని వారు గ్యాస్ ఏజెన్సీ యాప్ ద్వారా గానీ లేదా డిస్ట్రిబ్యూటర్ను సంప్రదించి గానీ పూర్తి చేయాలని సూచించారు. ఇక వ్యాపార సంస్థల ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు గడువును నవంబర్ 21 వరకు పొడిగించారు.
రూ. 2,000 కంటే ఎక్కువ యూపీఐ వ్యాపార లావాదేవీలపై 0.4 శాతం వరకు ఛార్జీ విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఛార్జీ కేవలం వ్యాపారులకు (మర్చంట్లకు) మాత్రమే వర్తిస్తుందని, సాధారణ ప్రజలు దుకాణాల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లించినా లేదా స్నేహితులు, బంధువులకు డబ్బు పంపినా ఎలాంటి ఛార్జీ ఉండదని తెలుస్తోంది.
దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన నవంబర్ 8 తర్వాత వెలువడే అవకాశం ఉంది. మరోవైపు, ఫోన్ కాల్స్‌లో కాలర్ పేరును చూపించే CNAP ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. దీని ద్వారా 4జీ, 5జీ నెట్‌వర్క్‌లలో వచ్చే కాల్స్‌లో కాలర్ పేరు స్క్రీన్‌పై కనిపిస్తుంది. విదేశాల నుంచి వచ్చే కాల్స్‌కు ‘ఇంటర్నేషనల్ కాల్’ అని చూపిస్తుంది.
వాహనదారులకు ఒక ముఖ్యమైన మార్పు.. జాతీయ రహదారుల టోల్ ప్లాజాల చుట్టూ 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే సొంత కారు, జీప్, వ్యాన్ యజమానులకు నవంబర్ 1 నుంచి వార్షిక ఫాస్టాగ్ పాస్ పథకం అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. దీని ప్రకారం, నగర శివారు వెలుపల ఉన్న టోల్ ప్లాజాలకు ఏడాదికి రూ.1,500, నగర పరిధిలో ఉన్న టోల్ ప్లాజాలకు రూ.3,000 వార్షిక రుసుము నిర్ణయించారు.
దీని కోసం చిరునామా ధృవీకరణ పత్రం (అడ్రస్ ప్రూఫ్), వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్సీ), పనిచేస్తున్న ఫాస్టాగ్ అవసరం. అయితే వాణిజ్య వాహనాలకు (కమర్షియల్ వెహికల్స్) ఈ సదుపాయం వర్తించదు. అంతేకాకుండా, ప్రతి నెల ఒకటో తేదీన చమురు సంస్థలు గ్యాస్ సిలిండర్ల ధరలను సమీక్షిస్తాయి కాబట్టి, నవంబర్ నెలకు సంబంధించి గృహ, వాణిజ్య సిలిండర్ల ధరల్లో ఏమైనా మార్పులు ఉంటాయా అనే నిరీక్షణ నెలకొంది. అయితే, ఈ మార్పుల్లో కొన్నింటి అమలు తేదీ, నిబంధనలపై అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే పూర్తి స్పష్టత వస్తుంది. కాబట్టి, ప్రజలు సంబంధిత సంస్థల అధికారిక ప్రకటనలను గమనించాలి.
