పాకిస్థాన్‌లోని లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్ తదితర ప్రధాన నగరాల్లో ఉన్న ప్రముఖ షాపింగ్ మాల్స్, విద్యాసంస్థల్లో అక్టోబర్ 31 శనివారం నాడు హాలోవీన్ వేడుకలు ఘనంగా జరిగాయి.
విక్టోరియన్ శైలి దెయ్యాల ఇళ్లు, భయానకమైన దుస్తులు ధరించి యువకులు, కుటుంబ సభ్యులు ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్యంగా, లాహోర్‌లోని ఓ ప్రముఖ ఇంజనీరింగ్, టెక్నాలజీ యూనివర్సిటీ విద్యార్థులు భయంకరమైన వేషాలు వేసుకుని వేడుకలు జరుపుకున్న వీడియోలు ఇంటర్నెట్లో విడుదలై పెద్ద చర్చకు దారితీశాయి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలను చూసి పాకిస్థాన్‌కు చెందిన చాలా మంది తమ తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. “పాకిస్థాన్‌లో ఎలాంటి సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు? ఇది సైతాన్ సంస్కృతిలా ఉంది. పాశ్చాత్య మోజులో పడి యువత తమ మతపరమైన మనోభావాలను, సంస్కృతిని మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు” అని, “హాలోవీన్ పండుగ వెనుక ఉన్న అసలు నేపథ్యం తెలియకుండా కేవలం ట్రెండ్ కోసం ఇలా చేస్తున్నారు” అని పలువురు విమర్శిస్తున్నారు.
హాలోవీన్ పండుగ చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిస్తే.. ఇది పురాతన సెల్టిక్ (Celtic) సంప్రదాయాలు మరియు ‘సామ్హైన్’ (Samhain) అని పిలువబడే రాక్షస శక్తుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి మంటలు వేసి, వింత వేషాలు వేసుకునే పంటల పండుగల నుంచి ఉద్భవించింది. ఇది నేరుగా సైతాన్ ఆరాధనతో ముడిపడి లేనప్పటికీ, ఇందులో మూఢనమ్మకాలు, ఇతర మతపరమైన ఆచారాలు కలిసి ఉండటం వల్ల.. చాలా మంది ఇస్లామిక్ పండితులు, సామాజిక కార్యకర్తలు ఇలాంటి వేడుకలను ఇస్లాంలో నిషేధించబడినవిగా పరిగణిస్తున్నారు.
పాకిస్థాన్ లాంటి సంప్రదాయ ఇస్లామిక్ దేశంలో పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో హాలోవీన్ వేడుకలు పెరగడం దేశ సాంస్కృతిక సంప్రదాయాలకు సవాలుగా మారిందని ఒక వర్గం ఆరోపిస్తోంది. అదే సమయంలో, పట్టణ యువత దీనిని కేవలం ఒక వినోదంగా మాత్రమే చూస్తున్నామని చెబుతున్నప్పటికీ.. ఈ సంఘటన ప్రస్తుతం పాకిస్థాన్ సోషల్ మీడియాలో అతిపెద్ద చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply