రష్యాకు చెందిన ఓ వ్యక్తి తనకు వస్తున్న తీవ్రమైన తలనొప్పి, దృష్టి లోపానికి గల కారణాన్ని వెతుక్కుంటూ ఆసుపత్రికి వెళ్లగా.. అతని కంట్లో ఒక చెట్టు విత్తనం మొలకెత్తి వేళ్లు పెరిగినట్లు తేలడం వైద్యులను సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది.
రష్యాలోని సైబీరియా ప్రాంతానికి చెందిన మాగ్జిమ్ స్లెప్ట్సోవ్ (42) అనే వ్యక్తి గత కొద్ది నెలలుగా నిరంతర తలనొప్పి, కంటి మంటతో బాధపడుతున్నాడు. వెల్డర్ మరియు ప్లంబర్‌గా పనిచేసే మాగ్జిమ్, కొన్ని నెలల క్రితం సైబీరియాలోని ఓ మారుమూల ప్రాంతానికి వెళ్లినప్పుడు, ఊహించని విధంగా ఒక చెట్టు కొమ్మ అతని కంటికి బలంగా తగిలింది. కంట్లో ఏదో నలుసు పడిందని భావించి అతను దానిని పెద్దగా పట్టించుకోలేదు; కానీ, ఆ చెట్టు నుంచి ఎగిరిన ఓ అతిచిన్న విత్తనం అతని కంట్లోనే ఉండిపోయింది.
రోజులు గడుస్తున్న కొద్దీ ఆ విత్తనం కంటిలోని తేమ కారణంగా నెమ్మదిగా మొలకెత్తడం ప్రారంభించింది. సుమారు నాలుగు నెలలుగా తీవ్రమైన తలనొప్పి, కంటి చూపు సమస్యతో బాధపడుతున్న అతను.. యాకుట్స్క్ నగరంలోని ఓ అత్యవసర ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు. అప్పుడు వైద్యులు సైతం షాకయ్యేలా.. అతని కంటిలోని తెల్లగుడ్డు ప్రాంతంలో ఆ విత్తనం మొలకెత్తి, సుమారు 3 మి.మీ మేర లోతుగా వేర్లు వ్యాపించినట్లు గుర్తించారు.
దీంతో వెంటనే అప్రమత్తమైన వైద్య బృందం, అతనికి మత్తుమందు (అనస్తీషియా) ఇచ్చి, ఒక సూది సహాయంతో ఆ చిన్న మొక్కను కంటి నుంచి సురక్షితంగా బయటకు తీశారు. సరైన సమయంలో సర్జరీ చేసి ఆ విత్తనాన్ని తొలగించడంతో, మాగ్జిమ్ కంటిచూపు పూర్తిగా కాపాడబడటమే కాకుండా, అప్పటివరకు అతన్ని తీవ్రంగా వేధిస్తున్న తలనొప్పి కూడా వెంటనే నయమైంది.

Leave a Reply