బీహార్ రాజధాని పాట్నాలోని ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల సైలీ రోడ్ ప్రాంతంలో ఉన్న ఓ ఆసుపత్రిలో ఊర్మిళా దేవి (55) ఉద్యోగిగా పనిచేస్తున్నారు.
గత అక్టోబర్ 29వ తేదీన యథావిధిగా విధుల్లో ఉన్న ఆమెను గుర్తుతెలియని దుండగుడు తుపాకీతో కాల్చి చంపిన ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఆకస్మిక హత్యపై వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు, హంతకుడు ఎవరనేది తెలుసుకునేందుకు ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు.
ఈ కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పోలీసు బృందాన్ని రంగంలోకి దించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలు, అందిన రహస్య సమాచారం ఆధారంగా పోలీసులు జరిపిన విచారణలో.. ఈ హత్యకు పాల్పడింది ఊర్మిళా దేవి సొంత అల్లుడు ముకేష్ కుమార్ అని తేలింది.
దీంతో పరారీలో ఉన్న ముకేష్ కుమార్ ఫ్లాట్‌లో పోలీసులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఆ సోదాల్లో అక్కడ దాచి ఉంచిన 21 బుల్లెట్లు, ఒక పదునైన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత కొనసాగించిన గాలింపు చర్యల్లో.. అక్టోబర్ 30వ తేదీ అర్ధరాత్రి 1:30 గంటల ప్రాంతంలో ఖగౌల్ (ఖహోల్) పోలీస్ స్టేషన్ పరిధిలో ముకేష్ కుమార్‌ను పోలీసులు చుట్టుముట్టి అరెస్టు చేశారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో హత్యకు గల దిగ్భ్రాంతికరమైన కారణాలు వెలుగులోకి వచ్చాయి. ముకేష్ భార్యకు వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని, ఆ సంబంధానికి అత్త ఊర్మిళా దేవి అండగా ఉండి సహాయం చేస్తోందని ముకేష్ తీవ్రంగా అనుమానించాడు. ఆ కోపంతోనే తన సొంత అత్తను తుపాకీతో కాల్చి చంపినట్లు విచారణలో వెల్లడైంది. ఇప్పటికే పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్న ముకేష్‌ను.. ఈ హత్యలో ఇంకెవరికైనా ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.

Leave a Reply