పంచకులలోని ఓ పాఠశాలలో దారుణ ఘటనకు బలైన చిన్నారి ఆరోగ్య పరిస్థితిలో ప్రస్తుతం మెరుగుదల కనిపించడం, యావత్ దేశానికి ఎంతో ఊరటనిచ్చింది.
చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (PGIMER)లో చికిత్స పొందుతున్న ఆ చిన్నారి, తాజాగా తొలిసారిగా తనంతట తానుగా ఆహారం తీసుకుంది.
పంచకుల పాఠశాలలో జరిగిన దారుణ ఘటన తర్వాత, ప్రాణాల కోసం పోరాడుతున్న ఆ చిన్నారిని ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చేర్పించారు. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఆ చిన్నారి కోలుకోవాలని ప్రార్థించారు. ఈ నేపథ్యంలో, ఆ చిన్నారి తొలిసారిగా కిచిడీ తినడం చూసి ఆమె తల్లిదండ్రులు తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు.
తమ కుమార్తె ఆరోగ్యం కోసం ప్రార్థించిన మంచి మనసున్న వారందరికీ చిన్నారి తల్లిదండ్రులు, ఆమె బాబాయ్ ఫాజిల్ ఓ వీడియో ద్వారా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కష్టకాలంలో దేశవ్యాప్తంగా లభించిన మద్దతు, ప్రార్థనలే తమకు కొండంత ఆశను, ధైర్యాన్ని ఇచ్చాయని వారు కన్నీటితో పేర్కొన్నారు.
చిన్నారి ఆరోగ్య పరిస్థితిలో ప్రస్తుతం మంచి పురోగతి ఉన్నప్పటికీ, ఆమె పూర్తిగా కోలుకోవడానికి ఇంకా నిరంతర చికిత్స అవసరమని వైద్యులు తెలిపారు. వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్న ఆ చిన్నారి, త్వరలోనే పూర్తిగా కోలుకుని సాధారణ జీవితానికి తిరిగి వస్తుందనే నమ్మకంతో ఆమె కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.
ఓ పాఠశాల తరగతి గదిలో 6 ఏళ్ల చిన్నారిని 8 ఏళ్ల బాలుడు కిరాతకంగా కొట్టడంతో పాటు, ఇటుకలతో తలపై దారుణంగా దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో విడుదలై తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. రక్తపు మడుగులో తరగతి గదిలో పడి ఉన్న చిన్నారిని రక్షించి, ఐసీయూలో చికిత్స అందించగా.. ప్రస్తుతం ఆమె మళ్లీ కోలుకుంటుండటం అందరికీ ఊరటనిచ్చింది.

Leave a Reply