ఆధునిక సౌకర్యాలున్న ఓ ఎత్తైన బహుళ అంతస్తుల భవనంలో, నాలుగు లిఫ్ట్‌లు ఉన్నప్పటికీ ఓ భవన నిర్మాణ కార్మికుడు తలపై ఇటుకలు మోసుకుంటూ 21వ అంతస్తుకు నడుచుకుంటూ వెళ్తున్నట్లు చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ దృశ్యాన్ని చూసిన నెటిజన్లు పలువురు కార్మికుల శ్రమ, వారికి కల్పిస్తున్న సౌకర్యాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే, ఈ భవనం ఎక్కడ ఉందనే వివరాలు మాత్రం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో.. ఓ కార్మికుడు తలపై ఇటుకలు పేర్చుకుని భవనం మెట్లు ఎక్కుతూ వెళ్తున్నాడు. అతని తలపై సుమారు 20 కిలోల బరువున్న ఇటుకలు ఉన్నట్లు ఆ వీడియో ద్వారా తెలుస్తోంది. ఒక్కో అంతస్తు ఎక్కుతున్నప్పుడు అతను ఆ బరువును బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లడం, అలసటతో రొప్పుతూ ఊపిరి పీల్చుకోవడం అందులో కనిపిస్తోంది. ఇలా ఇటుకలను 21వ అంతస్తు వరకు మెట్లపై తీసుకువెళ్లాల్సి రావడం చూసేవారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
ఈ వీడియోను రికార్డ్ చేసిన వ్యక్తి, ఆ భవనంలో మొత్తం నాలుగు లిఫ్ట్‌లు ఉన్నాయని, కానీ కార్మికులు వాటిని ఉపయోగించడానికి మాత్రం అనుమతి లేదని పేర్కొన్నాడు. నిర్మాణ పనులకు అవసరమైన సామాగ్రిని తరలించేందుకు గూడ్స్ లిఫ్ట్ లేదా భవన నిర్మాణ సామగ్రిని పైకి ఎత్తే యంత్రాలను ఉపయోగించే అవకాశం ఉన్నప్పటికీ, కార్మికుడిని ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టాలనే ప్రశ్నను అతను లేవనెత్తాడు. అయితే, లిఫ్ట్‌లు ఉపయోగించేందుకు అనుమతి నిరాకరించడానికి గల కారణాలపై ఎలాంటి అధికారిక వివరణ వెలువడలేదు.
ఈ వీడియో ఇంటర్నెట్‌లో విపరీతంగా వ్యాపించడంతో, చాలామంది కార్మికుల భద్రత, కనీస సౌకర్యాలపై తమ ఆవేదనను పంచుకుంటున్నారు. భవనాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించే కార్మికులకు కనీస సౌకర్యాలు నిరాకరించడం న్యాయమేనా అని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో, ఈ దృశ్యం వెనుక ఉన్న అసలు నేపథ్యం, భవనం ఎక్కడ ఉంది మరియు కార్మికులకు లిఫ్ట్ ఉపయోగించడానికి ఎందుకు అనుమతి ఇవ్వలేదనే కారణాలు ఇంకా నిర్ధారించబడలేదు.

Leave a Reply