భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌తో తన ప్రేమ వ్యవహారంపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శల పట్ల పంజాబీ నటి, మోడల్ సమ్రీన్ కౌర్ గట్టిగా బదులిచ్చింది.
అర్ష్‌దీప్ డబ్బు, పేరు ప్రఖ్యాతుల కోసమే అతడిని ఆమె ప్రేమిస్తోందని కొందరు చేసిన ఆరోపణలను సమ్రీన్ తీవ్రంగా ఖండించింది. తన వ్యక్తిగత జీవితం గురించి ఇతరులు అనవసరమైన వ్యాఖ్యలు చేయడం విసుగు తెప్పిస్తుందని, తన జీవితం గురించి ఎవరికీ వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం తనకు లేదని ఆమె స్పష్టం చేసింది.
తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టిన సమ్రీన్.. సోషల్ మీడియాలో మహిళలు ఎదుర్కొంటున్న ద్వంద్వ ప్రమాణాలను ఎత్తిచూపింది. ప్రేమ వ్యవహారాన్ని దాచిపెడితే భాగస్వామి పట్ల గర్వంగా లేరని విమర్శిస్తారని, అదే బహిరంగంగా పంచుకుంటే కేవలం పేరు ప్రఖ్యాతుల కోసమే చేస్తున్నారని తప్పుబడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఒకరి గుణం, ప్రవర్తన నచ్చి ప్రేమించినప్పటికీ దానికి రకరకాల కారణాలు ఆపాదిస్తున్నారని పేర్కొంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
తనను డబ్బు కోసమే ప్రేమిస్తోందని అంటున్న వారికి బదులిస్తూ.. తాను 17 ఏళ్ల వయసు నుంచే పనిచేస్తున్నానని, తన ఆర్థిక, వృత్తిపరమైన జీవితాన్ని తానే స్వయంగా నిర్మించుకున్నానని సమ్రీన్ తెలిపింది. ఇప్పటివరకు 20కి పైగా దేశాలు పర్యటించానని, బంధం ఉన్నా లేకపోయినా సంతోషంగా జీవించగలిగే జీవితాన్ని తాను ఏర్పరుచుకున్నానని చెప్పింది. తన ప్రయాణ, జీవన వ్యయాలను తానే భరించగలగడం దేవుడిచ్చిన ఆశీర్వాదంగా పేర్కొంది. అంతేకాకుండా, తనను అర్థం చేసుకుని, ప్రేమించే వ్యక్తి దొరకడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది.
తన సోషల్ మీడియా ఖాతాలో తన గురించి, తన ప్రేమ వ్యవహారం గురించి నిరంతరం పోస్ట్‌లు చేస్తూనే ఉంటానని సమ్రీన్ స్పష్టం చేసింది. ఆ పోస్ట్‌లు నచ్చని వారు తన పేజీని అన్‌ఫాలో చేయవచ్చని, అనవసరమైన విమర్శలు చేసే వారిని తన బృందం బ్లాక్ చేస్తుందని హెచ్చరించింది. ముఖ్యంగా, మహిళలే ఇతర మహిళలను కించపరుస్తూ మాట్లాడటం బాధాకరమని పేర్కొంది. ఇదిలా ఉండగా, సమ్రీన్ పోస్ట్‌ను షేర్ చేసిన అర్ష్‌దీప్ సింగ్.. ఆమెకు మద్దతుగా నిలిచాడు. ఇతరుల వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోకుండా, ఎవరి జీవితం వారు జీవించాలని, కేవలం ప్రేమను, గౌరవాన్ని పంచుకోవాలని అతను కోరాడు. ఈ జంట గత జులై నెలలో ఇన్స్టాగ్రామ్ ద్వారా తమ ప్రేమ వ్యవహారాన్ని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

Leave a Reply