ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కుషీనగర్ (Kushinagar) జిల్లాలో, తనను పెళ్లి చేసుకోకపోతే చేయి కోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ, ప్రియుడి ఇంటి పైకప్పు (డాబా) ఎక్కి 21 ఏళ్ల యువతి సృష్టించిన హైడ్రామా తీవ్ర కలకలం రేపింది.
హటా (Hata) ప్రాంతానికి చెందిన ఆ యువతి, రెండేళ్ల క్రితం గోపాల్ అనే యువకుడిని కలిసి ప్రేమించడం ప్రారంభించింది. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి గోపాల్ తనతో చనువుగా మెలిగాడని ఆ యువతి తెలిపింది.
కానీ, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినప్పుడు గోపాల్ దూరం జరిగేందుకు ప్రయత్నించడంతో, అతనిపై లైంగిక దాడి ఫిర్యాదు చేసిన ఆ యువతి.. శనివారం రోజున ప్రియుడి ఇంట్లోకి చొరబడి డాబా ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగింది.
‘నన్ను పెళ్లి చేసుకో, లేకపోతే చేయి కోసుకుని ప్రాణాలు తీసుకుంటా’ అని ఆ యువతి పైకప్పు పైనుంచి కేకలు వేయడంతో, ఇంటి ముందు భారీగా జనం గుమిగూడి ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత, కలకలం చోటుచేసుకుంది.
సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు, పలు గంటల పాటు శ్రమించి ఆమెకు నచ్చజెప్పి, శాంతింపజేసి సురక్షితంగా కిందకు దించారు. ప్రస్తుతం వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఘటనపై ముమ్మరంగా విచారిస్తున్నారు.

Leave a Reply