ఢిల్లీలోని జ్యోతి నగర్ ప్రాంతంలో కిడ్నాప్‌కు గురైన 13 ఏళ్ల బాలుడిని, పోలీసులు కేవలం మూడు గంటల్లోనే సురక్షితంగా రక్షించారు.
బాలుడిని ప్రాణాలతో వదిలేయాలంటే రూ.40 వేలు ఇవ్వాలని కిడ్నాపర్ బెదిరించినట్లు సమాచారం. దీంతో పోలీసులు వినూత్న ప్లాన్ అమలు చేసి, యూపీఐ (UPI) లావాదేవీ క్యూఆర్ కోడ్ సహాయంతో నిందితుడిని పట్టుకున్నారు. ఘజియాబాద్ జిల్లా లోనీ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల ఆకాష్ అనే యువకుడిని అరెస్టు చేశారు.
అక్టోబర్ 30వ తేదీ సాయంత్రం సుమారు 7.14 గంటల సమయంలో, తన 13 ఏళ్ల కుమారుడు కనిపించడం లేదని అతని తల్లి జ్యోతి నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సమీపంలోని దుకాణానికి వస్తువులు తీసుకురావడానికి వెళ్లిన బాలుడు.. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదని ఆమె తెలిపారు. ఈలోగా ఆమె మొబైల్ ఫోన్‌కు గుర్తుతెలియని నంబర్ నుంచి కాల్ వచ్చింది. అందులో, బాలుడిని సురక్షితంగా వదిలేయాలంటే రూ.40 వేలు ఇవ్వాలని కిడ్నాపర్ బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.
దీనిపై స్పందించిన పోలీసులు ఇన్‌స్పెక్టర్ ప్రవేశ్ కసానా నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, ఆ ప్రాంతంలోని సీసీటీవీ (CCTV) కెమెరా ఫుటేజీలు, మొబైల్ ఫోన్ లొకేషన్ వివరాలను విశ్లేషించారు. కిడ్నాపర్ నేరుగా డబ్బులు తీసుకోకుండా, వాట్సాప్ ద్వారా ఓ యూపీఐ (UPI) క్యూఆర్ కోడ్‌ను పంపాడు. దీన్ని ఆధారంగా చేసుకుని పోలీసులు వల పన్నారు. ముందుగా ఓ పోలీసు బ్యాంకు ఖాతా నుంచి ఆ కోడ్‌కు రూ.5,000 పంపించారు. ఆ లావాదేవీకి సంబంధించిన వివరాలను పరిశీలించగా.. ఆ కోడ్ కరవాల్ నగర్ ప్రాంతంలోని ఓ సైబర్ కెఫేకి చెందినదిగా తేలింది. అక్కడికెళ్లి విచారించగా, ఓ యువకుడు తనకు రూ.50 కమిషన్ ఇచ్చి రూ.5,000 నగదు తీసుకున్నాడని సైబర్ కెఫే యజమాని సునీల్ సైనీ చెప్పాడు.
దీంతో, పోలీసులు అదే యూపీఐ కోడ్‌కు మళ్లీ రూ.5,000 పంపించారు. ఆ డబ్బు తీసుకోవడానికి నిందితుడు మళ్లీ సైబర్ కెఫేకి వస్తాడని ఎదురుచూశారు. బాలుడితో కలిసి మళ్లీ అక్కడికి వచ్చిన ఆకాష్‌ను.. అప్పటికే అక్కడ మఫ్టీలో (సాధారణ దుస్తుల్లో) కాపు కాసిన పోలీసులు మెరుపు వేగంతో చుట్టుముట్టి అరెస్టు చేశారు. బాలుడిని సురక్షితంగా రక్షించారు. నిందితుడు ఆకాష్.. బాలుడి బంధువు ఒకరి ద్వారా పరిచయమైన వాడేనని, ఆ పరిచయంతోనే బాలుడిని తన స్కూటీపై మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడని పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి రూ.5,000 నగదు, కిడ్నాప్‌నకు ఉపయోగించిన స్కూటీ, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply