మాదకద్రవ్యాల (డ్రగ్స్) పట్టివేత కేసులో పంజాబ్ రాష్ట్రం ఖన్నా (Khanna) పోలీసులు, శివసేన నేత మహంత్ కాశ్మీర్ గిరిని అరెస్టు చేసిన ఘటన ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది.
కాశ్మీర్ గిరి ఇంట్లో ఉన్న రహస్య సీసీటీవీ (CCTV) కెమెరాలో రికార్డైన దృశ్యాలు బయటకు వచ్చి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఆ వీడియోలో, ఓ పోలీస్ సబ్-ఇన్స్పెక్టర్ (SI) ఇంటి పడకగదిలోని పరుపు కింద ఏదో ఒక వస్తువును దాచిపెడుతున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి.
అంతకుముందు, కాశ్మీర్ గిరి కారు డ్రైవర్ గుర్జంత్ సింగ్‌ను శుక్రవారం 7.5 గ్రాముల హెరాయిన్‌తో పోలీసులు అరెస్టు చేశారు. అతడిని విచారించిన సమాచారం ఆధారంగా.. శనివారం మధ్యాహ్నం పోలీసులు కాశ్మీర్ గిరి ఇంటికి వెళ్లి సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో పరుపు కింద నుంచి 30 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నామని చెబుతూ, పోలీసులు ఆయన్ను మెరుపు వేగంతో అరెస్టు చేశారు.
అయితే, ఈ సోదాల సమయంలో ఉన్నతాధికారులు పడకగదిలోకి ప్రవేశించడానికి ముందే, సదరు సబ్-ఇన్స్పెక్టర్ ఒంటరిగా లోపలికి వెళ్లి పరుపు కింద ఏదో వస్తువును పెట్టి బయటకు రావడం సీసీటీవీలో రికార్డైంది. అతను బయటకు వచ్చిన తర్వాతే మిగతా అధికారులు లోపలికి వెళ్లి సోదాలు చేసి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. తనను అరెస్టు చేసిన సమయంలో ‘నాకు, ఈ డ్రగ్స్‌కు ఎలాంటి సంబంధం లేదు’ అని కాశ్మీర్ గిరి మొత్తుకున్నప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు ఈ సీసీటీవీ ఫుటేజీ బయటకు రావడంతో పోలీసుల తీరుపైనే తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అరెస్టయిన మహంత్ కాశ్మీర్ గిరి.. ‘యాంటీ-ఖలిస్థాన్ ఫ్రంట్’ జాతీయ ప్రచారకుడిగా, శివసేన రాష్ట్ర స్థాయి బాధ్యుడిగా ఉన్నారు. ఇతనిపై హత్యాయత్నం సహా పలు తీవ్రమైన కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. గత ఏడాది 2025 సెప్టెంబర్‌లో ఇతనికి సంబంధించిన ముఠా నుంచి కిలోకు పైగా హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్న కేసులో అరెస్టై, బెయిల్‌పై బయటకు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఘటన చోటుచేసుకుంది.

Leave a Reply