“గొడవ అస్సలు ఆగలేదు!”.. పెట్టెలో బంధించినా కొనసాగిన పోరాటం.. ఉదయం జరిగిన దృశ్యాన్ని చూసి కంగుతిన్న వన్యప్రాణి సంరక్షకుడు..!!!

రాజస్థాన్ రాష్ట్రం కోటా (Kota) జిల్లాలో అత్యంత విషపూరితమైన రెండు ‘కామన్ క్రైట్’ (Common Krait – కట్లపాము) పాముల మధ్య జరిగిన ఓ వింత ఘటన స్థానికులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది.

మండానా (Mandana) ప్రాంతంలోని ప్రధాన మార్కెట్ సమీపంలో శనివారం అర్ధరాత్రి రెండు పాములు ఒకదానితో ఒకటి పెనవేసుకుని భీకరంగా పోట్లాడుకుంటున్నాయి.

ఇందులో ఒక పాము మరో పాము తలను పట్టుకుని మింగేందుకు ప్రయత్నించడం చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే వన్యప్రాణి సంరక్షకుడు (స్నేక్ క్యాచర్) లలిత్ బౌరాసికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఆయన, ఆ రెండు పాములను సురక్షితంగా పట్టుకుని ఒక పెద్ద పెట్టెలో బంధించాడు.

రెండు పాములను పట్టుకోవడంతో ఇక ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ, పెట్టెలో బంధించిన తర్వాత కూడా వాటి మధ్య గొడవ కొనసాగుతూనే ఉంది. మరుసటి రోజు ఆదివారం ఉదయం ఆ పాములను అడవిలో వదిలేసేందుకు పెట్టె తెరచి చూడగా.. అందులో ఒక పాము మాత్రమే కనిపించింది.

దీంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన వన్యప్రాణి సంరక్షకుడు పరిశీలించగా.. ఒక పాము మరో పామును పూర్తిగా మింగేసినట్లు తేలింది. ఆ రెండు పాములు సుమారు ఒకటిన్నర నుంచి రెండు అడుగుల పొడవు ఉంటాయని ఆయన తెలిపారు. ఈ వింత ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.

ఇదిలా ఉండగా, భారతదేశంలోని నాలుగు ప్రధాన విషపూరితమైన పాముల్లో (Big Four) కామన్ క్రైట్ (కట్లపాము) ఒకటి. దీని విషంలో ఉండే న్యూరోటాక్సిన్ (Neurotoxin) మనుషుల నాడీ వ్యవస్థపై నేరుగా తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనివల్ల కండరాలు పక్షవాతానికి గురవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి ప్రమాదాలు తలెత్తుతాయి. సకాలంలో వైద్యం అందకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. ముఖ్యంగా ఈ పాములు రాత్రి వేళల్లో ఎక్కువగా సంచరిస్తుంటాయి కాబట్టి, నేలపై నిద్రపోతున్న వారిని కాటేసే ప్రమాదం ఎక్కువ. ఇవి కాటేసినప్పుడు మొదట్లో నొప్పి గానీ, ఇతర లక్షణాలు గానీ స్పష్టంగా బయటకు కనిపించకపోవడం వల్లే వీటిని అత్యంత ప్రమాదకరమైనవిగా పరిగణిస్తారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *