బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్, అతని భార్య మీరా రాజ్‌పుత్ చిన్న వయసులోనే తల్లిదండ్రులు కావడం తమ జీవితంలో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాల్లో ఒకటని పేర్కొన్నారు.
పిల్లల పెంపకంలో ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ, వారితో ఎక్కువ సమయం గడపడానికి, వారి ఎదుగుదలలోని ప్రతి దశలో అండగా నిలవడానికి చిన్న వయసులో తల్లిదండ్రులు కావడం ఎంతగానో సహాయపడుతుందని ఇద్దరూ తమ అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా, పిల్లలతో కలిసి ఆడుకోవడానికి, క్రీడా పోటీల్లో పాల్గొనడానికి తల్లిదండ్రులకు శారీరక శక్తి ఎంతో అవసరమని షాహిద్ చెప్పారు.
2015లో షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్‌ల వివాహం జరిగింది. అప్పటికి మీరా వయసు 21 ఏళ్లు. పెళ్లయిన దాదాపు ఏడాది తర్వాత 2016లో వీరికి మిషా అనే కూతురు జన్మించింది. ఆ తర్వాత 2018లో జైన్ అనే కుమారుడు పుట్టాడు. కాగా, నటి కరీనా కపూర్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ‘వాట్ ఉమెన్ వాంట్’ (What Women Want) కార్యక్రమంలో పాల్గొన్న మీరా, చిన్న వయసులో తల్లి అయిన తన అనుభవం గురించి మనసు విప్పి మాట్లాడింది.
ఆ సమయంలో కరీనా కపూర్, జీవితంలో వేరొక దశలో తల్లి కావాల్సింది అని ఎప్పుడైనా అనిపించిందా అని మీరాను అడిగింది. దానికి మీరా బదులిస్తూ, తన నిర్ణయాన్ని మార్చుకోవాలని ఎప్పుడూ అనుకోలేదని స్పష్టం చేసింది. ఏ వయసులోనైనా తల్లి కావడం ఒక సవాలేనని, పిల్లలను పెంచేటప్పుడు కొన్నిసార్లు బాధ్యతల భారం ఎక్కువగా అనిపిస్తుందని ఆమె పేర్కొంది. అలాంటి సమయాల్లో భర్త షాహిద్ ఇచ్చిన మద్దతు, తన సోదరీమణుల నుంచి నేర్చుకున్న విషయాలు తనకు ఎంతగానో ఉపయోగపడ్డాయని తెలిపింది.
అంతేకాకుండా, పిల్లల పెంపకంలో తామిద్దరం బాధ్యతలు పంచుకుంటామని మీరా వెల్లడించింది. పిల్లల ఆటలు, వ్యాయామం, ఆహారపు అలవాట్లను షాహిద్ చూసుకుంటాడు. హోంవర్క్, పుట్టినరోజు వేడుకలు, క్లాసులు, పిల్లల అలవాట్లకు సంబంధించిన బాధ్యతలను మీరా చూసుకుంటుంది. ఇద్దరిలో ఒకరు ప్రయాణంలో ఉంటే, మరొకరు అన్ని బాధ్యతలనూ తీసుకుంటారని ఆమె పేర్కొంది.
ఇదిలా ఉండగా, నటుడు కపిల్ శర్మ షోలో మాట్లాడిన షాహిద్ కపూర్, తన తమ్ముడు ఇషాన్ ఖట్టర్‌కు త్వరగా పెళ్లి చేసుకోవాలని సలహా ఇచ్చాడు. తాను కూడా వివాహాన్ని ఆలస్యం చేయాలని అనుకోలేదని, అయినా తన పెళ్లి 34 ఏళ్ల వయసులో జరిగిందని అతను గుర్తుచేసుకున్నాడు. పిల్లలు ఎదుగుతున్నప్పుడు వారితో కలిసి ఆడుకోవడం, క్రీడా పోటీల్లో పాల్గొనడం వంటి కార్యక్రమాల్లో తల్లిదండ్రులు కూడా ఉత్సాహంగా పాలుపంచుకోవాల్సి ఉంటుంది కాబట్టి, చిన్న వయసులోనే తల్లిదండ్రులు కావడం ఒక గొప్ప ప్రయోజనమని షాహిద్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

Leave a Reply