“మా ఏరియా పిల్లిని ఎక్కడికి తీసుకెళ్లారు?” మండిపడిన ప్రజలు! కేఫ్ ఉద్యోగి చేసిన పనితో చెలరేగిన వివాదం. చివరకు 20 మంది వెతకగా.. పిల్లికి దొరికిన కొత్త ఇల్లు.!

ముంబైలోని బాంద్రా వెస్ట్ ప్రాంతంలో ఉన్న చాయోస్ (Chaayos) కేఫ్ సమీపంలో తరచుగా ఉండే ఓ వీధి పిల్లి అకస్మాత్తుగా అదృశ్యం కావడంతో సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది.

కేఫ్ సిబ్బందే ఆ పిల్లిని వేరే ప్రాంతానికి తరలించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో జంతు ప్రేమికులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. జరిగిన ఘటనకు బాధ్యత వహిస్తూ చాయోస్ యాజమాన్యం క్షమాపణలు చెప్పింది. అదృశ్యమైన ఆ పిల్లిని సురక్షితంగా రక్షించి కొత్త కుటుంబానికి అప్పగించారు.

బాంద్రా వెస్ట్ ప్రాంతంలో నివసిస్తున్న మెడిటేషన్ కోచ్ పూర్ణిమ హూన్ మోత్వాని, పిల్లి అదృశ్యం గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ పిల్లి ఆరోగ్యంగా ఉందని, దానికి స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ కూడా చేయించామని ఆమె తెలిపారు. అక్టోబర్ 28వ తేదీన ఇద్దరు కేఫ్ సిబ్బంది పిల్లిని ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయని ఆమె పేర్కొన్నారు. అప్పట్లో పక్కనే ఉన్న గ్యారేజ్ యజమాని జోక్యం చేసుకుని పిల్లిని తిరిగి కేఫ్ దగ్గరకు తీసుకువచ్చి విడిచిపెట్టారని చెప్పారు.

అయితే, ఆదివారం ఉదయం ఆ పిల్లి మళ్లీ కనిపించకుండా పోయిందని పూర్ణిమ తెలిపారు. దీనిపై కేఫ్ సిబ్బంది సహాయం అడిగితే తగిన సహకారం లభించలేదని ఆమె ఆరోపించారు. దీంతో ఆమె జంతు సంక్షేమ సంస్థల సహాయం కోరారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించడంతో, పలువురు కేఫ్ యాజమాన్యానికి వ్యతిరేకంగా కామెంట్లు పెట్టారు. కొందరు ఆ కేఫ్‌ను బహిష్కరించాలని కూడా డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో, హ్యుమానిటీ వరల్డ్ ఫౌండేషన్ (Humanity World Foundation) సభ్యులు గాలింపు చేపట్టి అదృశ్యమైన పిల్లిని కనుగొన్నారు. పూర్ణిమ మోత్వాని, ఆమె కుటుంబ సభ్యులు ఆ పిల్లిని దత్తత తీసుకుని శాశ్వతంగా పెంచుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనిపై చాయోస్ సంస్థ ఒక ప్రకటన విడుదల చేస్తూ, సరైన శిక్షణ లేని ఓ ఉద్యోగి పిల్లిని వేరే చోటకు తరలించాడని, ఇలా ఎప్పటికీ జరిగి ఉండకూడదని పేర్కొంది. అంతేకాకుండా, 20 మంది సిబ్బందితో కూడిన బృందం పిల్లి కోసం వెతికిందని, ఇకపై వీధి జంతువుల పట్ల కరుణతో వ్యవహరించేలా తమ అన్ని బ్రాంచ్‌లలోని సిబ్బందికి శిక్షణను, విధివిధానాలను మెరుగుపరుస్తామని సంస్థ హామీ ఇచ్చింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *