మహారాష్ట్రలోని పుణె నగరంలో ముకుంద్‌నగర్ ప్రాంతంలో వ్యాపారవేత్త అయిన ఛాంబరే (Chambhare) 29 ఏళ్ల కోడలు పాయల్ ఛాంబరే, తమకు చెందిన పాత అపార్ట్‌మెంట్‌లో ఆదివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ముకుంద్‌నగర్‌లో ‘ఛాంబరే ప్యాలెస్’ (Chambhare Palace) అనే భారీ కల్యాణ మండపాన్ని నడుపుతున్న ప్రముఖ వ్యాపారవేత్త కుటుంబంలో జరిగిన ఈ ఘటన, పుణె నగరమంతటా తీవ్ర కలకలం రేపింది.
ఘటన జరిగిన రోజు పుణె సమీపంలోని తన స్వగ్రామమైన ఖేడ్ శివాపూర్ (Khed Shivapur) ప్రాంతానికి వెళ్లిన పాయల్, తన సోదరుడి వివాహం కోసం పెళ్లిచూపుల కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంది. ఆ సమయంలో రోజంతా విచారంగా, మౌనంగా ఉండటాన్ని గమనించిన ఆమె సోదరుడు కారణం అడగ్గా.. పాయల్ బోరున విలపిస్తూ తన బాధను పంచుకుంది.
తన భర్త, మామ, అత్త మరియు ఆడపడుచు తనను మానసికంగా, శారీరకంగా నిరంతరం వేధిస్తున్నారని ఆమె ఏడ్చింది. ముఖ్యంగా, దీపావళి పండుగకు ఐదు సవర్ల (తులాలు) నగలు అడిగి వేధిస్తున్నారని, మామ మద్యం తాగి అసభ్య పదజాలంతో తిడుతున్నాడని, అత్త కొట్టి హింసిస్తోందని ఆమె కన్నీళ్లతో చెప్పింది. సోదరి భద్రత దృష్ట్యా మరికొన్ని రోజులు ఇక్కడే ఉండాలని తమ్ముడు సూచించినప్పటికీ, తన బిడ్డను తీసుకురావడం కోసం పాయల్ ఆదివారం సాయంత్రం భర్త ఇంటికి తిరిగి వెళ్లింది.
ఇంటికి వెళ్లిన కొన్ని గంటల్లోనే తన సోదరుడికి “దీనికి నా అత్తే కారణం” అని వాట్సాప్ ద్వారా చివరి మెసేజ్ పంపి, ఆమె అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. తల్లిని కోల్పోయి మూడేళ్ల చిన్నారి ఆద్య అనాథగా మారగా, కట్నం వేధింపులు మరియు కుటుంబ సభ్యుల హింస వల్లే ఈ ఆత్మహత్య జరిగిందని పోలీసులు కేసు నమోదు చేసి తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply