ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నానికి చెందిన ఓ యువకుడు పండ్ల ప్యాకింగ్ పని కోసం రష్యాకు వెళ్లగా, అక్కడ తనను మోసగించి సైన్యంలో చేర్చారని ఫిర్యాదు చేశాడు.
అతనితో పాటు మరో నలుగురు భారతీయులను కూడా ఇలాగే సైన్యంలో చేర్చినట్లు సమాచారం. ప్రస్తుతం వారు రష్యా-ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలోని యుద్ధ క్షేత్రంలో చిక్కుకున్నారని, తమను రక్షించాలని భారత ప్రభుత్వాన్ని వీడియో ద్వారా వేడుకున్నట్లు వార్తలు వచ్చాయి.
విశాఖపట్నానికి చెందిన 19 ఏళ్ల వంశీ ఉపాధి కోసం రష్యా వెళ్లాడు. అక్కడ పండ్ల ప్యాకింగ్ పని దొరుకుతుందని ఆశించి వెళ్లిన అతనికి మొదట్లో పని దొరకలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో నేపాల్‌కు చెందిన ఒక వ్యక్తి పరిచయమై, రష్యా సైన్యంలో ఆహార పదార్థాల ప్యాకింగ్ పని ఇప్పిస్తానని చెప్పాడు. ఇది నమ్మి అతనితో వెళ్లిన వంశీ సహా ఇతర యువకులను ఆ తర్వాత సైన్యంలో చేర్చారని వారు ఆరోపిస్తున్నారు.
దీనికి సంబంధించి విడుదలైన వీడియోలో, తమ పరిస్థితిని వివరించిన ఐదుగురు భారతీయులు సహాయం కోరారు. తమలో ముగ్గురిని ఇప్పటికే రెండు నెలల క్రితం యుద్ధ క్షేత్రానికి పంపించారని, వారి ప్రస్తుత పరిస్థితి ఏమిటో తెలియడం లేదని వంశీ తెలిపాడు. తమను కూడా త్వరలో యుద్ధభూమికి పంపుతారని భయపడుతున్నట్లు చెప్పారు. అంతేకాకుండా, రష్యన్ భాషలో రాసి ఉన్న పత్రాల వివరాలు అర్థం చేసుకోకుండానే తమతో సంతకాలు చేయించుకున్నారని, ఆ తర్వాత తమకు రష్యా పౌరసత్వం ఇచ్చినట్లు చెప్పారని వారు ఆరోపించారు.
ఈ క్రమంలో, వంశీ తల్లి తన కుమారుడిని సురక్షితంగా రక్షించి తీసుకురావాలని కేంద్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను కన్నీటిపర్యంతమై వేడుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లను కూడా ఆమె ఆశ్రయించి సహాయం కోరింది. దీనిపై స్పందించిన మంత్రి నారా లోకేష్, విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను రక్షించేందుకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని చర్యలు తీసుకోవాలని తన కార్యాలయాన్ని ఆదేశించారు. ఐదుగురు భారతీయులు సురక్షితంగా దేశం తిరిగి వస్తారా అనే ఉత్కంఠ వారి కుటుంబ సభ్యుల్లో నెలకొంది.

Leave a Reply