అమెరికాలో పిల్లల సంఖ్యకు సంబంధించి ధనవంతులకు, మధ్యతరగతి వారికి మధ్య వ్యత్యాసం పెరుగుతోందని ఒక అధ్యయనం తెలుపుతోంది.
సాధారణంగా అధిక ఆదాయం పొందేవారు తమ వృత్తి, హోదా, జీవనశైలికి ప్రాధాన్యతనిచ్చి తక్కువ మంది పిల్లలను కంటారనే భావన ఉండేది. కానీ ప్రస్తుతం వెలువడిన సమాచారం దీనికి భిన్నమైన ధోరణిని చూపుతోంది.
అమెరికాలోని అత్యంత సంపన్నులలో మొదటి ఒక శాతం (Top 1%) కుటుంబాల్లో, 49 శాతం మందికి ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నట్లు చెబుతున్నారు. అలాగే, అమెరికన్ కుటుంబాల్లో 42 శాతం మంది ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కోరుకుంటున్నారని సమాచారం. దీంతో, ఎక్కువ మంది పిల్లలను కనడంలో సంపన్న కుటుంబాలు ముందు వరుసలో ఉండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
అదే సమయంలో, మధ్యతరగతి కుటుంబాలు మూడో బిడ్డను కనడానికి వెనుకంజ వేస్తున్నాయి. అమెరికాలో ఒక బిడ్డను పెంచడానికి ఏడాదికి అయ్యే ఖర్చు సుమారు 11 నుంచి 12 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా. పిల్లల పెంపకం, విద్య మరియు దైనందిన అవసరాల ఖర్చులు ఆయా కుటుంబాల ఆర్థిక ప్రణాళికలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
అమెరికన్లు సగటున 2.7 మంది పిల్లలు కావాలని కోరుకుంటున్నప్పటికీ, వాస్తవానికి కుటుంబాల్లో పిల్లల సగటు సంఖ్య 1.6 మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు. కోరికకు, వాస్తవ జీవితానికి మధ్య ఇంత పెద్ద అంతరం ఎందుకు ఏర్పడుతోంది, ధనిక కుటుంబాలు ఎక్కువ మంది పిల్లలను ఎందుకు పెంచగలుగుతున్నాయి అనేది ఈ చర్చలో ప్రధాన ప్రశ్నలుగా మారాయి.

Leave a Reply