మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కన్హా టైగర్ రిజర్వ్‌లో పులులు వరుసగా మరణిస్తుండటం వన్యప్రాణుల సంరక్షణపై ఆందోళన కలిగిస్తోంది.
ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు కేవలం ఏడు నెలల్లోనే 11 పులులు మరణించాయి. ఇందులో 8 పులుల మృతికి కనైన్ డిస్టెంపర్ వైరస్ (CDV) ఇన్ఫెక్షన్ కారణమని ప్రభుత్వ రికార్డుల్లో పేర్కొన్నారు. సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలల్లో కూడా మరో రెండు పులులు మరణించడంతో, వాటి మరణానికి గల కారణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కుక్కల్లో కనిపించే కనైన్ డిస్టెంపర్ వైరస్, పులులతో సహా ఇతర వన్యప్రాణులకు కూడా వ్యాపించే ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ తీవ్రమైతే మెదడు, కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి, ప్రాణాపాయం కలిగించవచ్చు. దీంతో, కుక్కల నుంచి పులులకు ఈ వైరస్ ఎలా వ్యాపిస్తోంది, రిజర్వ్‌లో ఇన్ఫెక్షన్ ఏ మేరకు వ్యాపించిందనే ప్రశ్నలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే, చనిపోయిన ప్రతి పులికి ఈ వైరస్సే కారణమని ఇంకా నిర్ధారించబడలేదు.
కన్హా రిజర్వ్‌లో మే 19న ఆరేళ్ల మగ పులి ఒకటి శవమై కనిపించింది. ఆ తర్వాత జూన్ 23న మూడేళ్ల వయసున్న మరో మగ పులి మరణించింది. ఇలా పులులు వరుసగా మరణిస్తున్న ఘటనలు వన్యప్రాణి సంరక్షణ సంస్థల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. సెప్టెంబర్, అక్టోబర్‌లలో మరణించిన పులుల మృతికి కనైన్ డిస్టెంపర్ వైరస్ కారణమా లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయాన్ని స్పష్టం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ వ్యవహారంపై మధ్యప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. గత రెండు నెలల్లో కన్హా రిజర్వ్‌లో ఇంకేమైనా పులి కూనలు లేదా పెద్ద పులులు మరణించాయా, వాటి మరణానికి గల కారణాలు ఏమిటో కూడా తెలపాలని కోరింది. నవంబర్ 16న జరగనున్న తదుపరి విచారణలో, కన్హాలో వైరస్ ఇన్ఫెక్షన్ పరిస్థితి, పులులను రక్షించడానికి తీసుకున్న చర్యలపై కోర్టు సమీక్షించనుంది.

Leave a Reply