ఇంట్లో ఏళ్లుగా వాడకుండా పక్కనపెట్టిన పాత వస్తువులను తెరిచినప్పుడు కొన్నిసార్లు ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడుతుంటాయి.
అలాంటి ఒక ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుమారు 20 ఏళ్ల క్రితం మరణించిన తన తాతయ్య ఉంచిన ఒక నెయ్యి డబ్బాను ఒకరు తెరిచి చూడగా, అందులో నెయ్యి లాంటి గట్టి పదార్థం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ వీడియోను రాజు షా (Raju Shah) అనే వ్యక్తి తన ఎక్స్ (X) ఖాతాలో పంచుకున్నారు. 2006లో తాతయ్య మరణించారని, ఆ తర్వాత చాలా ఏళ్లకు ఆ డబ్బాను తెరిచినట్లు ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఈ ఘటన గురించి ఏఐ (AI) టెక్నాలజీ అయిన ‘గ్రోక్’ (Grok) ను అడగ్గా.. స్వచ్ఛమైన నెయ్యిలో నీరు, పాల ఘన పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి, సరైన పద్ధతిలో నిల్వ చేస్తే ఎక్కువ కాలం పాటు పాడవకుండా ఉండే అవకాశం ఉందని వివరించింది. నెయ్యి తయారు చేసేటప్పుడు వెన్నను వేడి చేసి, అందులో ఉన్న నీటిని ఆవిరి చేస్తారు. ఆ తర్వాత పాల ఘన పదార్థాలను కూడా వేరు చేయడంతో తేమ తగ్గుతుంది. అయినప్పటికీ గాలి, వెలుతురు, వేడి మరియు సరిగ్గా నిల్వ చేయకపోవడం వల్ల నెయ్యి వాసన, రంగు, రుచి మారవచ్చు. కాబట్టి 20 ఏళ్ల పాత నెయ్యి చూడటానికి బాగానే ఉన్నా, దానిని తినడం సురక్షితమని కచ్చితంగా చెప్పలేము.
ఇదిలా ఉండగా, ఆయుర్వేదంలో ఎక్కువ కాలం నిల్వ ఉంచిన నెయ్యిని ‘పురాణ ఘృతం’ (Purana Ghrita) అని పిలుస్తారని, పాత నెయ్యికి కొన్ని సాంప్రదాయ వైద్య ప్రయోజనాలు ఉంటాయని సమాచారం. కానీ ఇలాంటి వైద్యపరమైన వాదనలు ఆధునిక శాస్త్రీయ పరిశోధనల ద్వారా నిర్ధారించబడలేదు. దీంతో ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు పలు రకాల కామెంట్లు పెడుతున్నారు. కొందరు ఇది ఎన్నో ఏళ్ల నాటి స్వచ్ఛమైన నెయ్యి అని అంటుండగా, మరికొందరు ఆ డబ్బాలో ఉన్నది నెయ్యి కాదని; టర్కీలో ప్రసిద్ధి చెందిన ‘టులమ్ చీజ్’ (Tulum cheese) లాంటి వేరే ఆహార పదార్థం అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply