మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా ఎంపీ చెంపపై, అదే పార్టీకి చెందిన మరో ఎంపీ కొట్టినట్లుగా (చేయి చేసుకున్నట్లుగా) విడుదలైన వీడియో రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. గత నవంబర్ 1వ తేదీన ఢిల్లీలో జరిగిన ‘ఓటును కాపాడుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం’ ర్యాలీలో పాల్గొనేందుకు కాంగ్రెస్ ఎంపీలు బస్సులో ప్రయాణించారు. ఆ సమయంలో బస్సులో జరిగినట్లుగా చెబుతున్న ఈ ఘటనకు సంబంధించిన 10 సెకన్ల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వ్యాపిస్తోంది.
ఈ ఘటనలో, మహారాష్ట్రలోని రామ్‌టెక్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీ శ్యామ్ కుమార్ బర్వే, చంద్రపూర్ నియోజకవర్గ మహిళా ఎంపీ ప్రతిభా ధనోర్కర్ చెంపపై కొడుతున్నట్లుగా వీడియోలో ఉంది. మొదట ఏమీ మాట్లాడకుండా ఉన్న ప్రతిభా ధనోర్కర్, ఆ తర్వాత అతన్ని కోపంగా చూడటం కూడా ఆ దృశ్యంలో కనిపిస్తుంది. ఈ వీడియో కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారడంతో పాటు, పార్టీ మహిళా నాయకుల పట్ల ఇలాంటి ప్రవర్తన ఆమోదయోగ్యం కాదనే విమర్శలు కూడా వస్తున్నాయి.
ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితర సీనియర్ నేతలకు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు అందింది. అందులో, మహిళా నాయకుల గౌరవాన్ని కాపాడేందుకు, పార్టీ క్రమశిక్షణను కాపాడేందుకు సదరు ఎంపీపై తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారం పార్టీ అధిష్ఠానం దృష్టికి వెళ్లింది.
అయితే, ఈ ఘటనపై శ్యామ్ కుమార్ బర్వే భిన్నంగా వివరణ ఇచ్చారు. ప్రతిభా ధనోర్కర్ తనకు చెల్లెలు లాంటిదని, తమ ఇద్దరి మధ్య సరదాగా జరిగిన ఘటనను పెద్దది చేసి చూపుతున్నారని ఆయన తెలిపారు. అలాగే, ప్రతిభా ధనోర్కర్ కూడా తన చుట్టూ ఉన్న మహిళా నాయకులు సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు ఆటపట్టిస్తూ జరిగిన ఘటన అని చెప్పారు. ఒకవైపు వీడియో చూసి వివాదం చెలరేగుతుండగా, మరోవైపు సంబంధిత మహిళా ఎంపీయే అది సరదాగా జరిగిందని చెప్పడం ఈ వ్యవహారంలో కొత్త మలుపు తిప్పింది.

Leave a Reply