పునాది లేకుండానే 5 అంతస్తులు. 953 కిటికీలతో గంభీరంగా నిలబడిన రాజమహల్.! జైపూర్ ‘గాలి మేడ’ వెనుక ఉన్న ఆశ్చర్యపరిచే రహస్యం.!!

రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లో ఉన్న హవా మహల్, దాని ప్రత్యేకమైన వాస్తుశిల్పం, అందమైన రూపంతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది.

1799లో మహారాజా సవాయ్ ప్రతాప్ సింగ్ ఆదేశాల మేరకు వాస్తుశిల్పి లాల్ చంద్ ఉస్తాద్ దీనిని రూపొందించారు. ఐదు అంతస్తుల ఈ రాజభవనంలో తేనెతుట్టె ఆకారంలో 953 కిటికీలు ఉన్నాయి. వాటి ద్వారా గాలి ధారాళంగా లోపలికి ప్రవహించడం వల్ల రాజస్థాన్ ఎండల తీవ్రతలో కూడా ఈ మహల్ లోపల చల్లని వాతావరణం ఉంటుంది. అందుకే దీనికి ‘గాలి మేడ’ (ప్యాలెస్ ఆఫ్ విండ్స్) అని పేరు వచ్చింది.

ఎరుపు, గులాబీ రంగు ఇసుకరాయితో నిర్మించిన హవా మహల్, రాజపుత్ర, ఇస్లామిక్ వాస్తుశిల్ప శైలుల సమ్మేళనంగా నిర్మించబడింది. దీని పైభాగంలో ఉన్న పిరమిడ్ ఆకారం శ్రీకృష్ణుడి కిరీటంలా ఉంటుందని చెబుతారు. అందుకే దీనిని ‘జైపూర్ కిరీటం’ అని కూడా పిలుస్తారు. పునాది లేకుండా నిర్మించిన ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవనంగా పలు చోట్ల పేర్కొనబడే ఈ భవనం 87 డిగ్రీల కోణంలో వంగి ఉంటుందని కూడా అంటారు. అయితే, ఈ భవనానికి పునాదే లేదనే వాదనను అధికారులు ఖండించారని సమాచారం.

జైపూర్‌ను ‘పింక్ సిటీ’ (గులాబీ నగరం) అని పిలవడం వెనుక కూడా ఒక చరిత్ర ఉంది. బ్రిటన్ యువరాజు ఆల్బర్ట్ ఎడ్వర్డ్ జైపూర్ పర్యటనకు వచ్చినప్పుడు, అతనికి స్వాగతం పలికేందుకు నగరమంతటా గులాబీ రంగు వేశారు. ఆ రంగు యువరాజుకు బాగా నచ్చడంతో జైపూర్‌కు ‘పింక్ సిటీ’ అనే పేరు స్థిరపడిందని చెబుతారు. అనంతరం నగర గుర్తింపును కాపాడేందుకు ఆ ప్రాంత భవనాలకు కేవలం ‘జైపూర్ పింక్’ రంగును మాత్రమే ఉపయోగించేలా చట్టం తెచ్చారని చరిత్ర చెబుతోంది.

హవా మహల్‌లోని ప్రతి అంతస్తుకూ వేర్వేరు పేర్లు ఉన్నాయి. మొదటి అంతస్తులో రంగుల అద్దాల అలంకరణలతో శరద్ మందిర్, రెండవ అంతస్తులో రతన్ మందిర్ ఉన్నాయి. మిగిలిన మూడు అంతస్తులను విచిత్ర మందిర్, ప్రకాష్ మందిర్, హవా మందిర్ అని పిలుస్తారు. రాజభవనం లోపల రాజస్థాన్ సాంప్రదాయ సూక్ష్మ చిత్రాలతో కూడిన మ్యూజియం కూడా ఉంది. రాజ కుటుంబానికి చెందిన మహిళలు బయటి వారికి కనిపించకుండా జోహారీ బజార్‌లో జరిగే వేడుకలను, ఊరేగింపులను చూసేందుకే ఈ ప్రత్యేకమైన కిటికీలను ఏర్పాటు చేశారు. ఇలా చరిత్ర, కళ, వాస్తుశిల్పం వంటి ఎన్నో విశేషాలను తనలో ఇముడ్చుకున్న హవా మహల్, నేటికీ జైపూర్ ప్రధాన గుర్తింపుగా నిలుస్తోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *