“ఒక్క నిమిషం.. 5 గురిని ఢీకొట్టిన కారు!” అదుపుతప్పిన కారు బీభత్సం. కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్న యువకుడి వల్ల జరిగిన ఘోరం.!

పంజాబ్ రాష్ట్రం లూథియానాలో అదుపుతప్పిన ఒక కారు బీభత్సం సృష్టించి, ఓ కూరగాయల వ్యాపారి ప్రాణాలను బలిగొన్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

ఈ ఘటనలో మరో నలుగురు గాయపడ్డారు. ఇసా నగ్రి పులి ప్రాంతంలో ఉదయం సుమారు 8 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న స్కూటర్‌ను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో స్కూటర్ నడుపుతున్న కూరగాయల వ్యాపారి జగ్తార్ సింగ్ అందులో చిక్కుకుపోయాడు. అతనితో పాటు స్కూటర్‌ను కారు సుమారు 50 మీటర్ల దూరం లాడ్చుకెళ్లినట్లు సమాచారం. ఈ దారుణ ప్రమాదంలో అతడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు.

స్కూటర్‌ను ఢీకొట్టిన తర్వాత కూడా కారు ఆగకుండా ముందుకు దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారిని వరుసగా ఢీకొట్టడంతో మరో నలుగురు గాయపడ్డారు. వారిలో అశోక్ కుమార్ అనే వ్యక్తి ఒకరు. ప్రమాదం జరిగినప్పుడు తాను నడుచుకుంటూ వెళ్తున్నానని, ముందుగా కూరగాయల వ్యాపారిని కారు ఢీకొట్టడం చూశానని ఆయన తెలిపారు. ఆ తర్వాత కారు తనను కూడా ఢీకొనడంతో తాను స్పృహ కోల్పోయానని, తల, చేయి, వీపు భాగాల్లో గాయాలయ్యాయని పేర్కొన్నారు.

రోడ్డు పక్కన ఆపి ఉంచిన స్కూటర్లను ఢీకొట్టిన తర్వాతే ఆ కారు ఆగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారు నడుపుతున్న యువకుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న డివిజన్ నంబర్ 3 పోలీస్ స్టేషన్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

కారు నడిపిన యువకుడిని దమన్‌జోత్ సింగ్‌గా గుర్తించామని, అతడి వయసు సుమారు 20 నుంచి 22 ఏళ్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. అతను కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో అతడిని అరెస్టు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. కారు ఎందుకు అదుపు తప్పింది, ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఏమిటన్నది విచారణ పూర్తయిన తర్వాతే తెలుస్తుందని పోలీస్ ఇన్‌స్పెక్టర్ గుర్జీత్ సింగ్ వెల్లడించారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *