భారత్‌లోనే కాకుండా ఇండోనేషియాలోని కాలిమంతన్ ప్రాంతంలో కూడా తుపాను మరియు అగ్నిప్రమాద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఈ క్రమంలో, ఇండోనేషియా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (BNPB) తరపున లీజుకు తీసుకున్న ‘సూపర్ ప్యూమా వీహెచ్-హెచ్‌జీఎం’ (Super Puma VH-HGM) రకం హెలికాప్టర్, అడవుల్లో మంటలను ఆర్పే (Water Bombing) విధుల్లో ఉన్నప్పుడు ఊహించని విధంగా సాంకేతిక లోపం తలెత్తి గిరగిరా తిరుగుతూ ‘బారిటో’ (Barito) నదిలో కుప్పకూలింది.
దక్షిణ కాలిమంతన్‌లోని బారిటో కౌలా జిల్లా కురిపాన్ పరిధిలోని తబతాన్ గ్రామ ప్రాంతంలో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం 11.58 గంటల ప్రాంతంలో నదిలో నుంచి నీరు తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా అదుపుతప్పిన హెలికాప్టర్ నీటిలోకి దూసుకెళ్లింది.
అయితే, అదృష్టవశాత్తూ ఈ ప్రమాద సమయంలో హెలికాప్టర్లో ఉన్న ముగ్గురు సిబ్బందిని (ఆస్ట్రేలియాకు చెందిన మైఖేల్ జాన్, న్యూజిలాండ్‌కు చెందిన హ్యూగ్ ఆండ్రూ, ఇండోనేషియాకు చెందిన యాయాన్) సహాయక బృందాలు సురక్షితంగా రక్షించాయి. హెలికాప్టర్ భాగాలను సైతం నది ఒడ్డుకు చేర్చి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
కాగా, గతంలో మధ్య కాలిమంతన్లో ఇలాంటి సహాయక చర్యల్లోనే పాల్గొన్న సైన్యానికి చెందిన Mil-17 రకం హెలికాప్టర్ కుప్పకూలి ముగ్గురు మరణించడం గమనార్హం.

Leave a Reply