అయోధ్యలో సరయూ నదీ తీరంలో ప్రతి ఏటా అత్యంత ఘనంగా నిర్వహించే ‘దీపోత్సవం’ వేడుకలో, లక్షలాది మట్టి దీపాలు (ప్రమిదలు) వెలిగించి గిన్నిస్ రికార్డు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.
ఈ భారీ వేడుక కోసం వేలాది లీటర్ల ఆవనూనెను ఉపయోగిస్తారు.
ఈ క్రమంలో, ఈ ఏడాది వేడుక ముగిసి దీపాలు ఆరిపోయిన తర్వాత అక్కడ కనిపించిన ఒక దృశ్యం ఇంటర్నెట్లో అందరి మనసులను కలచివేస్తూ వైరల్గా మారింది.
వేడుక ముగిసిన తర్వాత ఆ ప్రాంతానికి చేరుకున్న స్థానిక పేద కుటుంబాలు, మహిళలు, చిన్నారులు.. ప్రమిదల్లో, నేలపై చిందిన మిగిలిన నూనెను సీసాలు, పాత్రల్లోకి సేకరిస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చి సోషల్ మీడియాలో వేగంగా వ్యాపిస్తున్నాయి.
పేదరికం కారణంగా తమ రోజువారీ వంటలకు, ఇళ్లలో దీపాలు వెలిగించుకోవడానికి అయ్యే ఖర్చును తగ్గించుకోవడానికే వారు ఇలా నూనెను సేకరిస్తున్నారని సమాచారం. ప్రతి సంవత్సరం దీపోత్సవ వేడుక ముగిసిన తర్వాత ఇలాంటి దృశ్యాలు బయటకు వచ్చి నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఒకవైపు అట్టహాసంగా సాగే పండుగ వైభవం, మరోవైపు సమాజంలో నెలకొన్న పేదరికపు నగ్నసత్యం.. ఈ రెండింటి మధ్య ఉన్న అంతరాన్ని ఈ సంఘటన స్పష్టంగా చూపిస్తోందని సోషల్ మీడియాలో ప్రజలు భావోద్వేగంతో కామెంట్లు పెడుతున్నారు.

Leave a Reply