బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్, తనకు బహుమతులు, శుభాకాంక్షలు పంపే అభిమానులకు స్వయంగా లేఖలు రాసి కృతజ్ఞతలు తెలపాలని భావిస్తున్నారు. కానీ, చేతిలో ఉన్న అసౌకర్యం కారణంగా అలా చేయలేక ఆయన ఇబ్బంది పడుతున్నారు.
దీపావళి సందర్భంగా తన బ్లాగ్‌లో చేసిన పోస్ట్‌లో ఆయన ఈ విషయం గురించి మనసు విప్పి మాట్లాడారు.
అభిమానులు, శ్రేయోభిలాషుల నుంచి తనకు ఎన్నో శుభాకాంక్షలు, బహుమతులు వస్తున్నాయని పేర్కొన్న ఆయన, వాటిని భద్రపరచడానికి కూడా ప్రస్తుతం స్థలం లేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. వారు పంపిన బహుమతులను సరిగ్గా దాచుకోకపోవడం వారి ప్రేమను అవమానించడమేనని, ప్రతి ఒక్కరి ప్రేమకు తగిన కృతజ్ఞతలు తెలపాలని భావిస్తున్నానని చెప్పారు.
అంతేకాకుండా, తనకు బహుమతులు పంపిన ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా లేఖలు రాసి బదులివ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు అమితాబ్ తెలిపారు. ఆ సమాధానాలను స్వయంగా తన చేత్తోనే రాయాలని ఆయన అనుకున్నప్పటికీ, చేతికి ఉన్న అసౌకర్యం కారణంగా వేగంగా రాయలేకపోతున్నానని, దీంతో సమాధానం ఇవ్వడంలో ఆలస్యం జరుగుతోందని వివరించారు.
ఇందుకుగాను ఆయన అభిమానులను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరారు. కొన్ని వారాల క్రితం విశ్రాంతి తీసుకోవాలని, ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని తనకు వైద్యులు సూచించినట్లు ఆయన తెలిపిన నేపథ్యంలో, ఇప్పుడు చేతి నొప్పికి సంబంధించిన ఈ పోస్ట్ వెలువడింది. అభిమానుల ప్రేమకు లేఖల ద్వారా నేరుగా కృతజ్ఞతలు తెలుపలేకపోవడం ఆయనకు ఆవేదనను మిగిల్చింది.

Leave a Reply