దీపావళి పండుగను జరుపుకోవడానికి టపాసులు కొనుగోలు చేయడం, వాటిని ఇళ్లకు తీసుకెళ్లడం సాధారణ విషయమే అయినప్పటికీ, సరైన భద్రతా జాగ్రత్తలు లేకుండా వాటిని తీసుకెళ్తే ఎలాంటి భారీ ప్రమాదాలు జరుగుతాయో చెప్పడానికి ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ దిగ్భ్రాంతికర ఘటనే ఒక ఉదాహరణ.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బహ్రైచ్ ప్రాంతంలోని కొత్వాలి నగర్, ఖండాఘర్ చోటీ బజార్ రోడ్డులో శనివారం రాత్రి ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై టపాసులు తీసుకెళ్తున్నారు. వారు పద్మా మార్కెట్ సమీపానికి చేరుకోగానే, ఊహించని విధంగా బండిపై ఉన్న టపాసులు ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయాయి. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ఇద్దరితో పాటు, పక్కన నిలబడి ఉన్న మరో ఇద్దరు కలిపి మొత్తం నలుగురు యువకులు గాయపడ్డారు.
టపాసులు పేలిన భయంకర శబ్దం ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించడంతో, దుకాణాల్లో ఉన్నవారు, రోడ్డుపై వెళ్తున్నవారు ఏం జరిగిందో అర్థం కాక తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు.. గాయపడిన నిమేష్ శ్రీవాస్తవ్ (20), అమన్, అభిషేక్ మరియు అమిత్ పాండే అనే నలుగురినీ రక్షించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో తీవ్రంగా గాయపడిన నిమేష్ శ్రీవాస్తవ్ను మెరుగైన చికిత్స కోసం వైద్య కళాశాల ఆసుపత్రికి మార్చారు.
ఈ ఘటనపై కొత్వాలి నగర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ బ్రిజేంద్ర మిశ్రా మాట్లాడుతూ, టపాసులు ఎందుకు పేలాయనే దానిపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దీపావళి సమయంలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలపై రాపిడి, వేడికి తావిచ్చేలా టపాసులను అజాగ్రత్తగా తీసుకెళ్లడం చాలా ప్రమాదకరమని, ప్రజలు భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని పోలీసులు హెచ్చరించారు.

Leave a Reply