ఆపిల్ సంస్థ తన తదుపరి ఐఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇటీవల ఐఫోన్ 18 ప్రో సిరీస్ మరియు ఫోల్డబుల్ ఐఫోన్ డుయో మోడళ్లను పరిచయం చేసిన సంస్థ, చాలామంది ఆశించిన సాధారణ ఐఫోన్ 18 మోడల్‌ను మాత్రం అప్పుడు విడుదల చేయలేదు.
ప్రస్తుతం వెలువడుతున్న సమాచారం ప్రకారం, వచ్చే ఏడాది ప్రారంభంలో ఐఫోన్ 18, ఐఫోన్ 18e మరియు ఐఫోన్ ఎయిర్ 2 మోడళ్లను విడుదల చేయడానికి ఆపిల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటిలో ఐఫోన్ 18e ఈ లైనప్‌లో తక్కువ ధర మోడల్‌గా ఉండొచ్చని భావిస్తున్నారు.
ఐఫోన్ 18 ప్రో మోడళ్లతో పోలిస్తే సాధారణ ఐఫోన్ 18 తక్కువ ధరకే రానున్నట్లు తెలుస్తోంది. అలాగే, ఇంకా తక్కువ ధరకు ఐఫోన్ కొనాలనుకునే వారి కోసం ఐఫోన్ 18eని తీసుకురావచ్చు. అయితే, ఈ మోడళ్ల అధికారిక ధరను ఆపిల్ ఇంకా ప్రకటించలేదు. తాజా సమాచారం ప్రకారం, ఐఫోన్ 18 ప్రారంభ ధర భారత్‌లో రూ.99,990గా ఉండొచ్చని, ఇది ఐఫోన్ 17 ధరకు సమానంగా ఉండవచ్చని చెబుతున్నారు.
ఐఫోన్ 18 మోడల్లో రెండు ప్రధాన మార్పులు ఉండొచ్చని సమాచారం. ముఖ్యంగా, మునుపటి మోడల్ కంటే పెద్ద బ్యాటరీ మరియు కొత్త ఏ20 (A20) చిప్‌సెట్‌ను ఇందులో అందించవచ్చు. 2 నానోమీటర్ టెక్నాలజీతో రూపొందించే ఈ చిప్సెట్, అత్యుత్తమ పనితీరును, తక్కువ విద్యుత్ వినియోగాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. దీంతో గేమింగ్ లాంటి కార్యకలాపాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. అలాగే, 6.3 అంగుళాల ఎల్టీపీఓ ఓఎల్ఈడీ (LTPO OLED) స్క్రీన్, 120 హెర్ట్జ్ ప్రోమోషన్ (ProMotion) సదుపాయం కూడా ఉండొచ్చని చెబుతున్నారు.
కెమెరా విషయానికొస్తే, ఐఫోన్ 18లో రెండు రియర్ కెమెరాలు ఉండొచ్చు. ఆ రెండూ 48 మెగాపిక్సెల్ సామర్థ్యంతో ఉండొచ్చని, ముందు భాగంలో 24 మెగాపిక్సెల్ కెమెరా ఉండొచ్చని లీకైన సమాచారం ద్వారా తెలుస్తోంది. బేస్ మోడల్లోనే 256 జీబీ స్టోరేజ్ అందించవచ్చని కూడా చెబుతున్నారు. అయితే, ఈ ఫీచర్లన్నీ ఇంకా అధికారికంగా నిర్ధారించబడలేదు. కాబట్టి, ఆపిల్ అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే ఐఫోన్ 18 మరియు ఐఫోన్ 18e మోడళ్ల అసలు ధర, ఫీచర్లు తదితర వివరాలు పూర్తిగా తెలుస్తాయి.

Leave a Reply