మనుషులకు గ్యాస్ సమస్య రావడం సహజం. అయితే అదే కారణంతో ఓ జంటను అద్దె ఇంటి నుంచి ఖాళీ చేయాలంటూ ఇంటి యజమాని నోటీసులు పంపిన ఘటన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. కెనడాలోని టొరంటోలో జరిగిన ఈ వింత ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎస్‌ఈ గ్రూమెట్, సామ్ క్రూగర్ అనే హాస్య కళాకారుల జంట ఓ అద్దె అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. అయితే వారి ఇంట్లో అకస్మాత్తుగా ఏర్పాటు చేసిన గాలి నాణ్యతను పర్యవేక్షించే సెన్సార్ పరికరం తరచూ అలారాలు మోగించడం మొదలుపెట్టింది. దీంతో ఇంటి యజమానికి, అద్దెకు ఉంటున్న జంటకు మధ్య వివాదం మొదలైంది.
తాము ఇంట్లో ఎలాంటి సిగరెట్లు కాల్చడం లేదని, సువాసన కోసం ఎలాంటి ప్రత్యేక ఉత్పత్తులను కూడా ఉపయోగించడం లేదని ఆ జంట స్పష్టం చేసింది. అయినప్పటికీ ఇంటి యజమాని వారి వివరణను అంగీకరించకుండా, వెంటనే ఇల్లు ఖాళీ చేయాలంటూ అధికారిక నోటీసు పంపినట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది.
ఈ సమస్యపై ప్రజారోగ్య నిపుణులను సంప్రదించినప్పుడు ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చినట్లు కథనం పేర్కొంటోంది. మనుషుల శరీరం నుంచి సహజంగా వెలువడే వాయువులు కూడా కొన్ని రకాల గాలి నాణ్యత సెన్సార్లలో మార్పులకు కారణమై హెచ్చరికలు రావడానికి దారితీయవచ్చని నిపుణులు వివరించినట్లు తెలుస్తోంది.
గత ఐదేళ్లుగా సరైన శాశ్వత నివాసం లేకుండా ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ జంట, ఎన్నో కష్టాల తర్వాతే ప్రస్తుత అద్దె అపార్ట్‌మెంట్‌లో నివాసం ఏర్పరచుకుంది. అయితే తమ నియంత్రణలో లేని సహజ శారీరక ప్రక్రియ కారణంగా ఇప్పుడు మరోసారి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడం వారిని తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది.
మరోవైపు, తమను ఎలాగైనా ఇంటి నుంచి బయటకు పంపించాలనే ఉద్దేశంతో ఇంటి యజమాని ఈ చిన్న సమస్యను పెద్దది చేస్తున్నారని ఆ జంట ఆరోపిస్తోంది. ఈ వివాదం ప్రస్తుతం టొరంటోలోని ల్యాండ్‌లార్డ్ అండ్ టెనెంట్ బోర్డు విచారణకు చేరినట్లు సమాచారం.
తమ చట్టపరమైన హక్కులను కాపాడుకోవడంతో పాటు న్యాయం కోసం పోరాడేందుకు ఆ జంట ఆన్‌లైన్ ద్వారా ప్రజల నుంచి ఆర్థిక సహాయం కూడా కోరుతోంది.
మొత్తానికి.. మనిషి శరీరానికి సంబంధించిన సహజమైన ప్రక్రియ కూడా అద్దె ఇంట్లో నివసించడానికి అడ్డంకిగా మారుతుందా? అనే ప్రశ్న ఈ ఘటనతో తెరపైకి వచ్చింది. ఇంటి యజమానుల హక్కులు ఒకవైపు, అద్దెదారుల హక్కులు మరోవైపు.. ఈ రెండింటి మధ్య నడుస్తున్న ఈ వింత వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తోంది.

Leave a Reply