క్రికెట్‌లో ఎన్నో విచిత్రమైన ఔట్‌లను చూసి ఉంటాం. కానీ బ్యాటర్ తన బ్యాట్‌తో బంతిని మళ్లీ తాకినందుకు ఔట్ కావడం మాత్రం అరుదైన సంఘటన. నేపాల్ ప్రీమియర్ లీగ్‌లో ఇలాంటి విచిత్ర ఘటన చోటుచేసుకుంది.
కీర్తిపూర్‌లోని త్రిభువన్ యూనివర్సిటీ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో జరిగిన 19వ లీగ్ మ్యాచ్‌లో పోఖారా అవెంజర్స్, కర్ణాలీ యాక్స్ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన పోఖారా జట్టు 217 పరుగుల భారీ స్కోరు సాధించింది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కర్ణాలీ జట్టుకు సోంపాల్ కామి కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో 15వ ఓవర్ చివరి బంతిని ఎదుర్కొన్న సోంపాల్ కామి దానిని సరిగ్గా ఆడలేకపోయాడు. బంతి బ్యాట్‌కు తగిలి కిందకు వెళ్లి, మళ్లీ కొద్దిగా పైకి లేచి అతని వైపు వచ్చింది.
ఈ క్రమంలో బంతిని మరోసారి తన బ్యాట్‌తో తాకి పక్కకు పంపించాడు సోంపాల్. అయితే, ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు దీనిపై అప్పీల్ చేయడంతో అంపైర్ అతడిని ఔట్‌గా ప్రకటించాడు. క్రికెట్ నిబంధనల్లోని 37వ నిబంధన – ఫీల్డింగ్‌కు ఆటంకం కలిగించడం (Obstructing the Field) కింద ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ విధంగా 19 బంతుల్లో 21 పరుగులు చేసిన సోంపాల్ కామి నిరాశతో పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఈ నిబంధన ప్రకారం, బ్యాటర్ ఉద్దేశపూర్వకంగా ఫీల్డింగ్ జట్టు చర్యలకు ఆటంకం కలిగిస్తే ఔట్‌గా ప్రకటించే అవకాశం ఉంటుంది. అయితే, ఈ వికెట్‌ను బౌలర్ ఖాతాలో జమ చేయరు.
ఇక ఈ మ్యాచ్‌లో పోఖారా అవెంజర్స్ జట్టు 63 పరుగుల తేడాతో కర్ణాలీ యాక్స్‌పై ఘన విజయం సాధించింది. పోఖారా తరఫున యూవరాజ్ సమరా కేవలం 48 బంతుల్లో 10 సిక్సర్లు, 10 ఫోర్లతో 102 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
అయితే, మ్యాచ్ ఫలితం కంటే సోంపాల్ కామి ఔటైన తీరు ప్రస్తుతం క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ విచిత్రమైన వికెట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Leave a Reply