బీహార్ రాష్ట్రం నలందా జిల్లాలో, దీపావళి పండుగ సందర్భంగా పుట్టింటి నుంచి భార్య తిరిగి రాకపోవడంతో తలెత్తిన కుటుంబ వివాదం కారణంగా ఓ ఇ-రిక్షా డ్రైవర్ ప్రాణాలు తీసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
రంగీలా బిఘా గ్రామానికి చెందిన విక్రమ్ కుమార్, తన భార్య ప్రీతి కుమారితో వీడియో కాల్లో మాట్లాడుతుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. పండుగ రోజులకైనా ఇంటికి రావాలని అతడు కోరాడని, కానీ మరో రెండు నెలల వరకు రాలేనని భార్య చెప్పినట్లు తెలిసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన విక్రమ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
విక్రమ్ కుమార్ ఇ-రిక్షా నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషించేవాడు. అతడికి, నవాడా జిల్లా రాజౌలి గ్రామానికి చెందిన ప్రీతి కుమారితో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక బిడ్డ కూడా ఉంది. వివాహం తర్వాత తలెత్తిన కుటుంబ కలహాల కారణంగా ప్రీతి తన పుట్టింటికి వెళ్లిపోయినట్లు సమాచారం. చాలా రోజులుగా ఆమె తిరిగి రాకపోవడంతో భార్యాభర్తల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలో, శనివారం సాయంత్రం ఇ-రిక్షా నడిపి ఇంటికి వచ్చిన విక్రమ్, తన భార్యకు వీడియో కాల్ చేసి దీపావళి, ఛత్ పండుగల కోసమైనా ఇంటికి రావాలని కోరాడు. కానీ, రెండు నెలల వరకు తాను తిరిగి రాలేనని ప్రీతి చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని, వీడియో కాల్లో మాట్లాడుతుండగానే విక్రమ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని వార్తలు తెలుపుతున్నాయి. ఇది చూసి షాక్‌కు గురైన ప్రీతి, వెంటనే విక్రమ్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించింది. దీంతో బంధువులు, ఇరుగుపొరుగు వారు వెంటనే అతని ఇంటికి పరుగులు తీశారు. కానీ, వారు అక్కడికి వెళ్లేసరికి విక్రమ్ ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. వెంటనే అతన్ని పావాపురిలోని వర్ధమాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు.
సమాచారం అందుకున్న నలందా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. విక్రమ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య దీర్ఘకాలంగా కుటుంబ వివాదాలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని నలందా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఘటన సమయంలో భార్య తన పుట్టింట్లో ఉందని, ఇద్దరూ వీడియో కాల్లో మాట్లాడుకున్నారని ఆయన వెల్లడించారు. అలాగే, విక్రమ్ ఉపయోగించిన సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని, ఘటనకు ముందు రికార్డ్ అయిన వీడియో తదితర వివరాలను పరిశీలిస్తున్నారు. మృతికి గల పూర్తి కారణాలపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది.

Leave a Reply