గుజరాత్ రాష్ట్రం సూరత్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త, దీపావళి పండుగను పురస్కరించుకుని తన సంస్థలో పనిచేస్తున్న 20 మంది మహిళా ఉద్యోగులకు రూ.20 లక్షలకు పైగా బోనస్‌గా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.
మోటా వరాచా ప్రాంతంలో ‘మహాదేవ్ క్లాత్ సెంటర్’ అనే వస్త్ర వ్యాపారాన్ని నడుపుతున్న రామ్‌స్వరూప్ ముండే అనే వ్యక్తే ఈ గొప్ప పని చేశారు. ఆయన ప్రతి మహిళా ఉద్యోగికి లక్ష రూపాయలకు పైగా నగదును కానుకగా అందించారు.
ఈ నగదును పంపిణీ చేస్తున్న సమయంలో తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. అందంగా అలంకరించిన వెండి పళ్లెల్లో రూ.10 నుంచి రూ.500 వరకు కరెన్సీ నోట్లను పేర్చి ఉద్యోగులకు అందజేశారు. ఈ ఊహించని బహుమతిని చూసి కొందరు మహిళా ఉద్యోగులు ఆనందభాష్పాలు రాల్చారు.
ఇందులో ఒక మహిళా ఉద్యోగిని, తనకు వచ్చిన ఈ డబ్బుతో సొంత ఇల్లు కొనుక్కోవాలనే తన కల నెరవేరుతుందన్న ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేసింది.
దీనిపై వ్యాపారవేత్త రామ్‌స్వరూప్ ముండే మాట్లాడుతూ.. తన సంస్థలో పనిచేసే వారు కేవలం ఉద్యోగులు మాత్రమే కాదని, కుటుంబ సభ్యుల లాంటి వారని, సంస్థ అభివృద్ధిలో వారి పాత్ర ఎంతో కీలకమని అన్నారు. చిన్నతనంలో తాను పేదరికాన్ని అనుభవించానని, అందుకే పండుగ సమయాల్లో కుటుంబాలు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులు తనకు బాగా తెలుసని ఆయన చెప్పారు.
అంతేకాకుండా, రాజస్థాన్ సంప్రదాయమైన ‘మామేరా’ (Mamera) ఆచారం ప్రకారం మహిళా ఉద్యోగులను సత్కరించాలని భావించినట్లు ఆయన తెలిపారు. ఆయన చేసిన ఈ గొప్ప పనికి ఇంటర్నెట్లో పలువురు విశేషంగా ప్రశంసలు కురిపిస్తున్నారు.

Leave a Reply