“మా నాన్నను చంపేసి వాళ్లు మాత్రం బయటకు వచ్చేశారే!” థార్ కారు ఢీకొని వ్యక్తి మృతి.. బెయిల్‌పై బయటకు వచ్చిన యువతి! కన్నీళ్లతో ప్రశ్నిస్తున్న కుమారుడు.!

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దీపావళికి ముందు రోజు వేగంగా వచ్చిన థార్ కారు ఢీకొట్టడంతో స్కూటర్‌పై వెళ్తున్న 50 ఏళ్ల సంతోష్ సింగ్ మృతి చెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

తన భార్య కోసం చీర కొనుక్కుని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఇటలీలో చదువుకుని సొంతూరికి తిరిగి వచ్చిన గీతా సచాన్ అనే యువతి నడుపుతున్నట్లుగా చెబుతున్న థార్ కారు, సంతోష్ సింగ్ స్కూటర్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి అతడిని, స్కూటర్‌ను సుమారు 20 మీటర్ల దూరం వరకు లాడ్చుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో సంతోష్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు.

ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఆ యువతితో పాటు ఆమె చెల్లెలు, తదితరులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం తర్వాత కారు దిగిన వారు అక్కడి నుంచి మరో కారులో వెళ్లిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈలోగా, ప్రమాదానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో విడుదలై కలకలం రేపింది. సంతోష్ సింగ్ కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి వెళ్లి అతన్ని గుర్తించినప్పటికీ, ముందుగా గుర్తు తెలియని వ్యక్తిగా పోలీసులు కేసు నమోదు చేశారని అతడి కుమారుడు రాహుల్ ఆరోపించాడు.

దీంతో ఆగ్రహించిన రాహుల్, తన తండ్రి మృతదేహాన్ని తీసుకునేందుకు నిరాకరించి ఆందోళనకు దిగాడు. అంతేకాకుండా, ప్రమాదానికి కారణమైన యువతిని అరెస్టు చేయాలని, ఆమెకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా అనే కోణంలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు థార్ కారు యజమానిని గుర్తించారు. ఆ కారు ఇసుక కాంట్రాక్టర్ గుడ్డు సచాన్‌కు చెందినదని, ప్రమాద సమయంలో అతని కుమార్తె గీతా సచాన్ కారు నడిపిందని పోలీసులు తెలిపారు. అనంతరం ఆమెను అరెస్టు చేశారు.

అయితే, అరెస్టయిన తర్వాత గీతా సచాన్ వెంటనే బెయిల్‌పై బయటకు రావడం సంతోష్ సింగ్ కుటుంబ సభ్యులకు మరింత ఆవేదన కలిగించింది. దీనిపై కుమారుడు రాహుల్ ఆవేదన వ్యక్తం చేస్తూ.. దీపావళికంటే ముందే తమ కుటుంబంలో చీకట్లు అలుముకున్నాయని, తండ్రిని కోల్పోయి తమ కుటుంబం శోకసంద్రంలో ఉంటే, ప్రమాదానికి కారణమైన యువతి మాత్రం తన కుటుంబంతో కలిసి దీపావళి జరుపుకుంటోందని కన్నీటిపర్యంతమయ్యాడు. ఈ క్రమంలో అరెస్ట్, బెయిల్ ప్రక్రియలపై కోర్టులో ప్రశ్నలు తలెత్తాయని, ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని సమాచారం.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *