ఊబకాయం తగ్గింపు, మధుమేహం (షుగర్ వ్యాధి) చికిత్స కోసం ప్రపంచవ్యాప్తంగా విరివిగా ఉపయోగిస్తున్న ‘ఓజెంపిక్’ (Ozempic), ‘వెగోవి’ (Wegovy), ‘మౌంజారో’ (Mounjaro) తదితర ప్రముఖ GLP-1 కేటగిరీ మందుల వల్ల శాశ్వత అంధత్వం ముప్పు పొంచి ఉందని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ప్రపంచానికి తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. బరువు తగ్గాలనే ఆరాటంలో చాలా మంది ఆశ్రయిస్తున్న ఈ ఆధునిక వైద్య విధానాల వెనుక దాగి ఉన్న భయంకరమైన ప్రమాదాలు ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయి.
ఈ రకమైన మందులు వాడటం వల్ల కంటి నరాలకు వెళ్లే రక్త ప్రసరణకు తీవ్ర అంతరాయం కలుగుతుందని తాజా పరిశోధనల ద్వారా వెల్లడైంది. దీనివల్ల ‘NAION’ అనే తీవ్రమైన కంటి చూపు సమస్య తలెత్తే అవకాశాలు అధికంగా ఉన్నందున, ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
దీని తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ఈ మందులను విక్రయించే ఫార్మా సంస్థలు తమ ఉత్పత్తుల లేబుళ్లపై నరాలు, కంటి చూపు దెబ్బతింటాయనే హెచ్చరికను తప్పనిసరిగా ముద్రించాలని FDA స్పష్టం చేసింది. ప్రపంచ దేశాల వైద్యరంగంలో తీవ్ర ప్రకంపనలు సృష్టించిన ఈ వార్త.. కేవలం బరువు తగ్గేందుకు మందులు, మాత్రలపై ఆధారపడే వారిని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.

Leave a Reply