ఏడాదికి 11 మి.మీ. మేర కదులుతున్న భూభాగం. 1,000 ఏళ్ల నాటి పురాతన ఆలయానికే ముప్పు.! వంగిపోతున్న స్తంభాలు, గోడల్లో పగుళ్లు. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు.!!

ఉత్తరాఖండ్ రాష్ట్రం బాగేశ్వర్ జిల్లాలోని గోమతీ నదీ లోయ ప్రాంతం ఏటా 7.5 నుంచి 11 మిల్లీమీటర్ల మేర కదులుతున్నట్లు (జరుగుతున్నట్లు) ఓ తాజా అధ్యయనంలో తేలింది.

దీని ప్రభావం ఆ ప్రాంతంలో ఉన్న చారిత్రక ప్రసిద్ధి చెందిన బైజ్‌నాథ్ ఆలయ సముదాయంపై తీవ్రంగా పడుతోంది. గుడిలోని స్తంభాలు, గోడలు వంగిపోవడం, రాళ్లు పక్కకు జరగడం, పగుళ్లు ఏర్పడటం వంటివి చోటుచేసుకుంటున్నాయి. భూగర్భంలో సంభవిస్తున్న భౌగోళిక మార్పులు, నదీ ప్రవాహం, భూగర్భ జలమట్టాల్లో వస్తున్న హెచ్చుతగ్గులే ఇందుకు ప్రధాన కారణమై ఉండొచ్చని ఆ అధ్యయనం పేర్కొంది.

యూనివర్శిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్‌తో పాటు పలు భారతీయ, విదేశీ సంస్థలకు చెందిన పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని చేపట్టారు. ఇందుకోసం ప్రత్యక్ష క్షేత్రస్థాయి పరిశీలనతో పాటు, ఉపగ్రహాల ద్వారా పనిచేసే ఆధునిక రాడార్ సాంకేతికతను కూడా ఉపయోగించారు. డి-ఇన్సార్ (D-InSAR) టెక్నాలజీ ద్వారా ఏటా సుమారు 7.5 మిల్లీమీటర్ల మేర భూకదలిక ఉన్నట్లు, అలాగే పీఎస్-ఇన్సార్ (PS-InSAR) టెక్నాలజీ ద్వారా ఈ కదలిక సుమారు 11 మిల్లీమీటర్ల మేర ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

ఈ భూకదలికల వల్ల బైజ్‌నాథ్ ఆలయ సముదాయం నిర్మాణంలో తీవ్ర మార్పులు వచ్చాయి. ఆలయ స్తంభాలు 5 నుంచి 15 డిగ్రీల వరకు అపసవ్య దిశలో (Anti-clockwise) తిరిగినట్లు అధ్యయనంలో నమోదైంది. అంతేకాకుండా, కొన్ని స్తంభాలు, రాళ్లు వాటి అసలు స్థానం నుంచి 1 నుంచి 4 సెంటీమీటర్ల వరకు బయటకు జరిగాయి. గుడి ప్రధాన గోపురం, గోడల్లో సుమారు 40 నుంచి 55 సెంటీమీటర్ల పొడవైన పగుళ్లను కూడా గుర్తించారు. పార్వతీ దేవి ఆలయం, వినాయక ఆలయాలు కూడా గోమతీ నది వాలు వైపునకు కాస్త వంగినట్లు కనిపిస్తోంది. కేదారేశ్వర ఆలయంతో పాటు ఇతర గుళ్ల నిర్మాణాల్లోనూ ఈ తరహా మార్పులు చోటుచేసుకున్నట్లు రికార్డైంది.

ఈ ఆలయ సముదాయాన్ని కత్యూరి (Katyuri) రాజులు క్రీ.శ. 7వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం మధ్య కాలంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అంతకుముందు 1505లో సంభవించిన భారీ భూకంపం కారణంగా కూడా ఈ ఆలయ సముదాయం దెబ్బతింది. ఆ తర్వాత 1602లో లక్ష్మీ చంద్ రాజు ఈ గుడిని పునరుద్ధరించారు. మళ్లీ 1803లో వచ్చిన మరో భూకంపం కూడా ఈ గుడి గోడలు, స్తంభాలను దెబ్బతీసింది. కాగా, ప్రస్తుతం గుర్తించిన ఈ నిరంతర భూకదలికలు, నిర్మాణపరమైన పగుళ్లు.. ఈ పురాతన చారిత్రక కట్టడాల మనుగడ, భద్రతపై తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తున్నాయి.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *