ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్‌నగర్‌లో పెళ్లి విందు (పార్టీ) విషయమై చెలరేగిన వివాదం రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది.
స్నేహితుడికి పెళ్లి విందు ఇవ్వకపోవడంతో మొదలైన ఈ గొడవ, రెండు కుటుంబాలు ఎదురెదురుగా దాడులు చేసుకునే స్థాయికి చేరింది. ఈ ఘటనలో రెండు వర్గాల వారు ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా రాళ్లు రువ్వుకున్నారు.
ముజఫర్‌నగర్‌లోని మన్సూర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారా గ్రామానికి చెందిన మనీష్ అనే యువకుడికి కొద్ది రోజుల క్రితం వివాహం జరిగింది. అతని స్నేహితుడు ఆశు.. మనీష్‌ను పెళ్లి పార్టీ అడిగినట్లు సమాచారం. అయితే పార్టీ ఇవ్వడానికి మనీష్ నిరాకరించడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ గొడవలో ఇద్దరి కుటుంబ సభ్యులు కూడా జోక్యం చేసుకోవడంతో వివాదం మరింత పెద్దదైంది.
దీంతో రెండు వర్గాల వారు దాడులకు దిగారు. ఇళ్ల మిద్దెలపై (టెర్రస్ పై) నిలబడి ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ భయానక దృశ్యాలను తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఘర్షణలో ముగ్గురికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా, ఈ ఘర్షణకు సంబంధించి ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పోలీస్ అధికారి రూపాలి రావు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.

Leave a Reply