“నన్ను వీడియో తీస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటా..!” నేనూ ప్రభుత్వ ఉద్యోగినే, అధికారం చూపించకండి.. రైలులో టికెట్ లేకుండా ప్రయాణించిన సైనికులకు, మహిళా టీటీఈకి మధ్య వాగ్వాదం.. వైరల్ వీడియో..!!

రైలులో టికెట్ లేకుండా ప్రయాణించిన ఇద్దరు ఆర్మీ జవాన్లకు, ఒక మహిళా టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)కి మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.

టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఆ ఇద్దరు జవాన్లను, జరిమానా మరియు టికెట్ ఛార్జీ కలిపి రూ. 1,100 చెల్లించాలని మహిళా టీటీఈ కోరారు. అయితే జరిమానా కట్టడానికి నిరాకరించిన జవాన్లు.. కావాలంటే చలాన్ రాయండి లేదా తర్వాతి స్టేషన్‌లో దిగిపోతామని బదులివ్వడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది.

టీటీఈ తన ట్యాబ్ ద్వారా జవాన్ల ఫోటోలు తీసేందుకు ప్రయత్నించగా, ప్రతిగా ఒక జవాన్ తన మొబైల్ ఫోన్‌లో వీడియో తీయడం ప్రారంభించారు. దీంతో ఆగ్రహానికి గురైన మహిళా అధికారి, ఒక మహిళను వీడియో తీస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, ఇది మీ ఉద్యోగానికే ప్రమాదంగా మారుతుందని హెచ్చరించారు.

అక్కడే ఉన్న మరో టీటీఈ కూడా జవాన్లను రైలు నుంచి దించేస్తామని గట్టిగా మాట్లాడటంతో, అధికారాన్ని దుర్వినియోగం చేయవద్దంటూ ఇరువర్గాలు ఒకరిపై ఒకరు వేలు చూపిస్తూ వాదించుకున్న దృశ్యాలు ఆ వీడియోలో రికార్డయ్యాయి.

‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వైరల్ అయిన ఈ వీడియోపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. సైనికులపై ఎంత గౌరవం ఉన్నప్పటికీ నిబంధనలు ఉల్లంఘించడం తప్పేనని కొందరు అంటుండగా, టీటీఈలు కాస్త సంయమనంతో, మర్యాదగా వ్యవహరించి ఉండాల్సిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ ఘటనపై విచారణ జరుపుతామని రైల్వే శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *