భారత జట్టుతో జరగనున్న వన్డే సిరీస్ చివరి రెండు మ్యాచ్‌ల కోసం న్యూజిలాండ్ జట్టును ప్రకటించారు. ఈ జట్టులో 31 ఏళ్ల అన్క్యాప్డ్ (ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేయని) ఫాస్ట్ బౌలర్ బ్రెట్ రాండెల్ (Brett Randell) చోటు దక్కించుకున్నాడు.
గత మార్చిలో జరిగిన ప్లంకెట్ షీల్డ్ క్రికెట్ టోర్నీలో వరుసగా 5 బంతుల్లో 5 వికెట్లు తీసి చారిత్రాత్మక రికార్డు సృష్టించినందుకు బహుమతిగా అతనికి ఈ అవకాశం లభించింది.
ఆ మ్యాచ్‌లో తన బౌలింగ్‌తో ప్రత్యర్థులను బెంబేలెత్తించిన రాండెల్, కేవలం 4 పరుగుల వద్ద వికెట్ నష్టపోకుండా ఉన్న ప్రత్యర్థి జట్టును అకస్మాత్తుగా 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయేలా కుప్పకూల్చాడు. తన ఓవర్ చివరి బంతితో మొదలైన వికెట్ల వేటను, తర్వాతి ఓవర్ మొదటి బంతి నుంచే కొనసాగించిన అతను హ్యాట్రిక్ సాధించడంతో పాటు వరుసగా ఐదో వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకుని అదరగొట్టాడు.
తన అద్భుత ప్రదర్శనను అక్కడితోనే ఆపని రాండెల్, తన ఎనిమిదో బంతికి కూడా మరో వికెట్ పడగొట్టి.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో 8 బంతుల్లో 6 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రాండెల్ వేసిన ఈ కచ్చితమైన, వేగవంతమైన బంతులు ప్రత్యర్థి బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేయడమే కాకుండా, యావత్ క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి.
ఇప్పటివరకు తన క్రికెట్ కెరీర్లో 46 ఫస్ట్ క్లాస్, 55 లిస్ట్-ఏ మరియు 45 టీ20 మ్యాచ్‌లు ఆడిన బ్రెట్ రాండెల్, ఎన్నో వికెట్లు పడగొట్టి తన సత్తా నిరూపించుకున్నాడు. ప్రస్తుతం భారత జట్టుతో జరగనున్న కీలక వన్డే సిరీస్‌లోనూ చోటు దక్కించుకోవడంతో, అంతర్జాతీయ క్రికెట్లోనూ అతను తనదైన ముద్ర వేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

Leave a Reply