ముంబై సబర్బన్ రైలులో ప్రయాణిస్తున్న 20 ఏళ్ల యువతికి ఎదురైన లైంగిక వేధింపులు, దాడి ఘటన.. చివరికి ఆమె ఎడమ చేతిని కోల్పోయేంతటి తీవ్ర విషాదానికి దారితీసింది.
2026 నవంబర్ 4న బోరివలి నుంచి విరార్ వైపు వెళ్తున్న లోకల్ రైలులో ఆ యువతి ప్రయాణిస్తోంది. రైలు నైగావ్ (Naigaon) స్టేషన్ సమీపానికి చేరుకున్న సమయంలో, తోటి ప్రయాణికుడైన హిర్ముఖే అనే వ్యక్తి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు సమాచారం.
దీనితో దిగ్భ్రాంతికి గురైన ఆ యువతి, అతడి తీరును తీవ్రంగా నిలదీస్తూ ప్రతిఘటించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం ముదరడంతో, ఆగ్రహంతో ఆ యువతి తన చెప్పుతో అతడిని కొట్టింది. ప్రతిగా ఆ దుర్మార్గుడు యువతిపై దాడి చేయడమే కాకుండా, రైలు నైగావ్ స్టేషన్‌లోకి ప్రవేశిస్తున్న సమయంలో ఆమెను కదులుతున్న రైలులో నుంచి కిందికి తోసేశాడు.
రైలులో నుంచి కిందికి పడిపోయిన ఆ యువతి, రెండు బోగీల మధ్య ఉన్న ఖాళీలో పడిపోయింది. ఆమె తేరుకుని తిరిగి ప్లాట్‌ఫామ్‌పైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా, రైలు అకస్మాత్తుగా ముందుకు కదలడంతో రైలు చక్రాలు ఆమె ఎడమ చేతి మీదుగా దూసుకెళ్లాయి. ఈ ఘోర ప్రమాదంలో మోచేతి సమీపంలో ఆమె ఎడమ చేయి పూర్తిగా తెగిపోవడంతో పాటు, తలకు కూడా బలమైన గాయమై 16 కుట్లు పడ్డాయి.
మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేసిన ఈ కిరాతక ఘటనపై భయందర్ (Bhayandar) రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. స్టేషన్‌లోని సీసీటీవీ (CCTV) కెమెరా దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించి నిందితుడు హిర్ముఖేను గుర్తించారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు.

Leave a Reply