రాజస్థాన్ రాష్ట్రం భిల్వారా జిల్లాలోని మండల్ పట్టణంలో, దీపావళి మరుసటి రోజున జరుపుకునే గోవర్ధన పూజ సందర్భంగా ఒక విభిన్నమైన సాంప్రదాయ వేడుక నిర్వహిస్తారు.
దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ రోజున ఆవులు, ఎద్దులకు పూజలు చేస్తుండగా, ఇక్కడ మాత్రం గాడిదలకు ప్రత్యేక పూజలు చేసి ఘనంగా వేడుకలు జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా గోవర్ధన పూజ రోజున అర్ధరాత్రి వరకు ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.
కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన ప్రజలు తమ గాడిదలకు స్నానం చేయించి, శరీరంపై రంగులు వేసి, పూలమాలలతో అందంగా అలంకరిస్తారు. ఆ తర్వాత వాటిని ఊరిలోని ప్రధాన కూడలికి తీసుకొచ్చి సాంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహిస్తారు. పూజ ముగిసిన తర్వాత గాడిదలకు బెల్లం తినిపించి నోరు తీపి చేస్తారు.
ఈ పూజ వెనుక వారి జీవనోపాధికి సంబంధించిన కృతజ్ఞతా భావం దాగి ఉంది. పూర్వం కుమ్మరులు చెరువులు, కుంటల నుంచి మట్టిని తీసుకురావడానికి గాడిదలనే ఎక్కువగా ఉపయోగించేవారు. కుండల తయారీ వృత్తికి ప్రధాన ఆధారంగా నిలిచిన గాడిదలకు కృతజ్ఞతలు తెలిపే ఉద్దేశంతోనే ఈ ఆచారం మొదలైందని చెబుతారు. పూజ అనంతరం గాడిదల కాళ్ల దగ్గర టపాసులు కట్టి పేల్చడం ద్వారా వాటిని పరుగులు పెట్టిస్తూ పందెం కూడా నిర్వహిస్తారు. ఈ వింత వేడుకను తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.
ఈ వినూత్న సంప్రదాయం మండల్ పట్టణంలో సుమారు 71 ఏళ్లుగా నిరాటంకంగా కొనసాగుతోంది. గతంలో ప్రతి కుమ్మరి ఇంట్లో గాడిదలను పెంచేవారని, కాలక్రమేణా రవాణా మరియు సాంకేతిక సదుపాయాలు పెరగడంతో వాటి సంఖ్య బాగా తగ్గిపోయిందని స్థానిక కుమ్మరి గోపాల్ తెలిపారు. అయినప్పటికీ, పూర్వీకులు పాటించిన ఆచారాన్ని మరువకుండా నేటికీ దీపావళి మరుసటి రోజున గాడిదలకు పూజలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply