బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన మరుగుదొడ్డిని (వాష్రూమ్) వేరొక వ్యక్తి ఉపయోగించారంటూ వచ్చిన ఫిర్యాదు సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీసింది.
దీనివల్ల ఆ సదుపాయం అత్యవసరమైన ఒక ప్రయాణికుడు 25 నిమిషాలకు పైగా బయటే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో విడుదలై అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఆ వీడియోలో, దివ్యాంగుల వాష్రూమ్ బయట వేచి ఉన్న ప్రయాణికుడు.. ఎంతసేపటికీ లోపల ఉన్న వ్యక్తి బయటకు రావడం లేదంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా, గతంలోనూ తనకు ఇలాంటి చేదు అనుభవం రెండుసార్లు ఎదురైందని, ఇప్పుడు మూడోసారి కూడా ఇదే సమస్య పునరావృతమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విమానాశ్రయంలో అందరి కోసం సాధారణ మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నప్పటికీ, దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సదుపాయాలను వారికి అవసరమైన సమయంలో ఉపయోగించుకోలేని దుస్థితి నెలకొనడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బెంగళూరు విమానాశ్రయ యాజమాన్యం కూడా స్పందించింది. ఈ ఘటనకు సంబంధించి సదరు ప్రయాణికుడి కాంటాక్ట్ వివరాలు, ఘటన జరిగిన ప్రదేశం గురించిన సమాచారాన్ని కోరిన యాజమాన్యం, ఆయనకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసింది. అలాగే, ఈ విషయాన్ని సంబంధిత విభాగం దృష్టికి తీసుకెళ్లామని తెలిపింది.
దివ్యాంగుల కోసం కేటాయించిన సదుపాయాలు నిజంగా అవి అవసరమైన వారికే దక్కేలా చూడాల్సిన ఆవశ్యకతను ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది. విమానాశ్రయాలలో ఉండే ఇలాంటి ప్రత్యేక వాష్రూమ్ల వినియోగంపై సరైన నియంత్రణ, అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రయాణికుడు చేసిన ఫిర్యాదుపై విమానాశ్రయ యాజమాన్యం తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Leave a Reply