“వెనుక నుంచి కారు వస్తోంది.. టెస్లా ఒక్కసారిగా పక్కకు తప్పుకుందే!” ఆ తర్వాత కొన్ని సెకన్లలోనే ఘోర ప్రమాదం.. ప్రమాదాన్ని ముందే పసిగట్టిందా టెస్లా? వైరల్ అవుతున్న వీడియో..!

అమెరికాలోని ఉటా (Utah) రాష్ట్రంలో, అతివేగంతో దూసుకొస్తున్న ఒక కారు ప్రమాదానికి గురికావడానికి కొన్ని సెకన్ల ముందు, ఓ టెస్లా (Tesla) కారు తన దారి నుంచి పక్కకు తప్పుకున్నట్లు చూపిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ దృశ్యాన్ని చూసిన చాలా మంది, టెస్లాలోని అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీ అయిన ‘ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్’ (FSD) ప్రమాదాన్ని ముందే పసిగట్టి చాకచక్యంగా వ్యవహరించిందంటూ ప్రశంసిస్తున్నారు. అయితే, ఈ ప్రమాదంలో అతివేగంగా కారు నడిపిన వ్యక్తి మృతి చెందినట్లు వీడియోను షేర్ చేసిన వారు వెల్లడించారు.

కాథ్లీన్ ఆండర్సన్ అనే మహిళ, ఒకే ప్రమాదానికి సంబంధించి వివిధ కోణాల్లో రికార్డయిన మూడు వీడియోలను ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. అందులో కనిపిస్తున్న టెస్లా కారు ఆటోపైలట్ (స్వయంచాలక) మోడ్‌లో ప్రయాణిస్తోందని, వెనుక నుంచి అతివేగంగా వస్తున్న వాహనాన్ని గుర్తించగానే రోడ్డు పక్కకు కొద్దిగా తప్పుకుందని ఆమె పేర్కొన్నారు. ఆ టెస్లా కారు తన సోదరుడి స్నేహితుడికి చెందినదని కూడా ఆమె తెలిపారు.

మరో సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం.. టెస్లా కారు ఎగ్జిట్ రోడ్డు వద్ద నెమ్మదిగా వెళ్తూ పక్కకు జరిగింది. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన తెలుపు రంగు సెడాన్ కారు, టెస్లాను దాటుకుని ఎడమవైపునకు దూసుకెళ్లి కూడలిలో (జంక్షన్‌లో) మరో వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి టెస్లా కారు సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. ఈ దృశ్యాలు పలు కోణాల్లో వైరల్ కావడంతో టెస్లా పనితీరుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

అయితే, టెస్లాలోని FSD టెక్నాలజీయే ప్రమాదాన్ని గ్రహించి కారును పక్కకు తప్పించిందనే విషయంపై ఇప్పటివరకు స్వతంత్రంగా ఎలాంటి ధ్రువీకరణ లేదు. ఆ సమయంలో FSD ఫీచర్ నిజంగానే ఆన్‌లో ఉందా, లేక డ్రైవర్ స్వయంగా కారును పక్కకు తిప్పారా అనేది స్పష్టంగా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసుల అధికారిక నివేదిక గానీ, టెస్లా సంస్థ వివరణ గానీ ఇంకా వెలువడలేదు. కాబట్టి, కేవలం వైరల్ వీడియో ఆధారంగానే ఆటోమేటిక్ టెక్నాలజీ ప్రాణాలను కాపాడిందని కచ్చితమైన నిర్ధారణకు రాలేమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *