బీహార్ రాష్ట్రం బెగుసరాయ్ ప్రాంతంలో, పెళ్లయిన కేవలం ఐదు నెలలకే కుటుంబ కలహాల కారణంగా ఒక యువకుడిని దారుణంగా కొట్టి చంపిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని, విషాదాన్ని నింపింది. భార్యతో ఉన్న విభేదాలు మరియు ఈ విషయంపై పెద్దలకు ఫిర్యాదు చేయడమే ఈ హత్యకు ప్రధాన కారణమని తెలుస్తుండగా, ఈ ఘటనను నిరసిస్తూ మృతుడి బంధువులు, గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
పారిహారా పోలీస్ స్టేషన్ పరిధిలోని పారిహారా గ్రామానికి చెందిన అభయ్ చౌదరి (30) ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. గత 2026 జూన్ నెలలో అభయ్‌కు, మల్లిపూర్‌కు చెందిన నందిని కుమారితో వివాహం జరిగింది. అభయ్‌కు అన్న వరుసయ్యే ప్రవీణ్ చౌదరి తన భార్య చెల్లెలిని ఇచ్చి ఈ పెళ్లి జరిపించాడు.
అయితే, పెళ్లయిన నాటి నుంచే భార్యాభర్తల మధ్య సఖ్యత లేదని తెలుస్తోంది. ఐదు నెలల వైవాహిక జీవితంలో నందిని కేవలం మూడు సార్లు మాత్రమే అత్తవారింటికి వచ్చిందని, మిగిలిన రోజుల్లో ఏదో ఒక కారణం చెప్పి పుట్టింటికి వెళ్లిపోయేదని సమాచారం. అభయ్ ఎన్నోసార్లు బతిమాలినప్పటికీ, నందిని అతనితో కలిసి ఉండటానికి గానీ, దాంపత్య జీవితానికి గానీ నిరాకరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, తనతో ఉండాలని బలవంతం చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని ఆమె బెదిరించినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
దీపావళి పండుగ సమయంలో అభయ్ ఇంట్లో మరోసారి కుటుంబ కలహాలు చెలరేగాయి. ఆ సమయంలో నందిని తన బంధువులను పిలిపించుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో, ఈ వ్యవహారంపై పెద్దల వద్ద పంచాయితీ పెట్టడానికి వెళ్లిన అభయ్ కుటుంబ సభ్యులకు.. ప్రవీణ్ చౌదరి మరియు అతని కుటుంబ సభ్యులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన ప్రవీణ్ చౌదరి, అతని కుటుంబ సభ్యులు అభయ్ తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా, అభయ్ తలపై క్రికెట్ బ్యాట్‌తో అత్యంత కిరాతకంగా మోదారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అభయ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం అతను కన్నుమూశాడు.
పోస్టుమార్టం అనంతరం అభయ్ మృతదేహాన్ని గ్రామానికి తీసుకురావడంతో స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిందితులందరినీ తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ, పోలీసులు కేసు నమోదు చేయడంలో జాప్యం చేశారని ఆరోపిస్తూ గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు.
సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ కుందన్ కుమార్, ఇతర పోలీసు అధికారులు ప్రజలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. తొలుత అభయ్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడి, గాయపరిచిన సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా, ఇప్పుడు అభయ్ మరణించడంతో దీనిని హత్య కేసుగా మార్చారు. అలాగే, ఫిర్యాదులో పేర్లు లేని ఇతర నిందితుల వివరాలతో కొత్తగా ఫిర్యాదు ఇస్తే కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.

Leave a Reply