తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్ సమీపంలో ఉన్న మరవన్ కుడియిరుప్పు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో (సొసైటీ), లాకర్లో ఉంచిన 50 తులాల (సవర్ల) బంగారు ఆభరణాలు మాయమైన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
కీళ రామన్పుదూర్ ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల జెబి ప్రియాంక అనే మహిళ, గత సెప్టెంబర్ 15వ తేదీన తన 50 తులాల బంగారు ఆభరణాలను ఆ సహకార సంఘం లాకర్లో ఎంతో భద్రంగా దాచిపెట్టారు. ఈ క్రమంలో, నవంబర్ 7వ తేదీన ఆభరణాలను తిరిగి తీసుకోవడానికి బ్యాంకుకు వెళ్లిన ఆమె లాకర్‌ను తెరిచి చూశారు. అయితే, అందులో ఒక్క నగ కూడా లేకుండా లాకర్ ఖాళీగా ఉండటాన్ని చూసి షాక్‌కు గురైన ఆమె, ఈ విషయంపై బ్యాంకు సిబ్బందిని నిలదీశారు.
అనంతరం బాధితురాలు కోట్టార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనపై విచారణ జరిపేందుకు సహకార సంఘానికి వెళ్లిన పోలీసులకు అక్కడ మరో షాక్ ఎదురైంది.
అక్కడి సీసీటీవీ కెమెరా ఫుటేజీలు లభించలేదని తెలుస్తోంది. అంతేకాకుండా, పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో బ్యాంకు ప్రధాన ద్వారం తాళాలు గానీ, ఆభరణాలు ఉంచిన లాకర్ గానీ పగలగొట్టిన ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదని సమాచారం.
దీంతో, బయటి వ్యక్తులు లోపలికి చొరబడి నగలు దోచుకెళ్లారా లేక సొసైటీ కార్యకలాపాలు, లాకర్ వివరాలు బాగా తెలిసిన వారే ఈ పనికి పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ముఖ్యంగా, లాకర్ మరియు దాని తాళం చెవి వివరాలు తెలిసిన సిబ్బందిలో ఎవరికైనా ఈ చోరీతో సంబంధం ఉందా అనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు. 50 తులాల బంగారం మాయమవ్వడంతో పాటు సీసీటీవీ దృశ్యాలు కూడా లభించకపోవడం నాగర్‌కోయిల్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. అయితే, ఈ ఘటన వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, నగలు ఎలా మాయమయ్యాయి అనేది పోలీసుల విచారణ పూర్తయిన తర్వాతే తేలనుంది.

Leave a Reply