ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో, తీవ్ర మనస్తాపానికి గురైన ఒక యువతి సెల్‌ఫోన్ టవర్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహారాజ్‌గంజ్ జిల్లా బైత్వాలియా (Baithwalia) గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువతి, అదే ప్రాంతానికి చెందిన వేరే సామాజిక వర్గానికి చెందిన ఒక యువకుడిని ప్రేమించింది. అయితే, వీరి ప్రేమను ఆ యువతి కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు.
ప్రేమను అంగీకరించకపోవడమే కాకుండా, వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువతి, ఈరోజు తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఆ ప్రాంతంలో ఉన్న సెల్‌ఫోన్ టవర్ ఎక్కింది.
సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు, పోలీసులు ఆ యువతితో మాట్లాడి శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. టవర్ పైనుంచి కిందకు దిగాలని వారు పదే పదే నచ్చజెప్పారు.
వారి సుదీర్ఘ ప్రయత్నాల తర్వాత, ఆ యువతి టవర్ పైనుంచి సురక్షితంగా కిందకు దిగింది. అనంతరం ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply