అరుణాచల్ ప్రదేశ్కు చెందిన అమన్ అపాంగ్ అనే యువతి జీవితం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. చిన్నతనంలో కుటుంబం ఎదుర్కొన్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఆమెను ఎన్నో కష్టాలకు గురిచేశాయి. కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా డబ్బుల్లేని పరిస్థితి ఆమెను మానసికంగా ఎంతో బాధించింది. అయితే, అదే కష్టాలు జీవితంలో ఏదో సాధించాలనే పట్టుదలను ఆమెలో పెంచాయి.
ఒకరోజు భోజనం చేసే సమయంలో తన ప్లేట్లో కూరగాయలు లేవని అమన్ తినడానికి నిరాకరించింది. దీంతో కోపం తెచ్చుకున్న ఆమె తల్లి.. “నీకు ఇంతటి సౌకర్యాలు కావాలా? నువ్వేమైనా ఎమ్మెల్యే కూతురివా?” అని ప్రశ్నించారు. తల్లి అన్న ఆ మాటలు చిన్నారి అమన్ మనసులో బలంగా నాటుకుపోయాయి. ఎప్పటికైనా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుని కుటుంబ పేదరికాన్ని తొలగించాలని అప్పుడే నిర్ణయించుకుంది.
ఇంటిపనుల్లో కుటుంబ సభ్యులకు సహాయం చేస్తూనే పెరిగిన అమన్.. ఒకప్పుడు తన చేతిలో కనీసం రూ.20 కూడా లేని పరిస్థితిని ఎదుర్కొంది. అవసరాలకు తల్లిదండ్రులను డబ్బులు అడగడానికి కూడా సంకోచించేది. కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆమెను ఎంతో బాధించేది. అయితే ఆ పరిస్థితులే ఆమెకు జీవితంలో ముందుకు సాగాలనే పట్టుదలను ఇచ్చాయి.
ప్రస్తుతం అమన్ జపాన్లో నివసిస్తోంది. క్యోటో సమీపంలోని ఓ సంప్రదాయ జపనీస్ హోటల్లో పనిచేస్తోంది. హోటల్ ఉద్యోగంతో పాటు సోషల్ మీడియా కోసం వీడియోలు రూపొందిస్తోంది. అంతేకాకుండా, జపనీస్ భాష నేర్చుకోవాలనుకునే భారతీయులకు, జపాన్లో ఉద్యోగాలు వెతుక్కునేవారికి సహాయం చేసే ఎస్ఎస్డబ్ల్యూ (SSW) వీసా కేంద్రంలో కూడా పనిచేస్తోంది.
ఇలా ఒకటి కంటే ఎక్కువ పనులు చేస్తూ తన ఆదాయాన్ని పెంచుకుంటోంది. ప్రస్తుతం జపాన్లో నెలకు సుమారు రూ.లక్ష వరకు సంపాదిస్తున్నట్లు కథనంలో పేర్కొన్నారు. ఈ స్థాయికి చేరుకోవడం అంత సులభం కాలేదని, తనతో ప్రయాణం ప్రారంభించిన కొందరు స్నేహితులు మధ్యలోనే తమ లక్ష్యాలను మార్చుకున్నప్పటికీ.. తాను మాత్రం పట్టుదలతో ముందుకు సాగానని అమన్ తన అనుభవాన్ని పంచుకుంది.
ఒకప్పుడు చిన్న అవసరాల కోసం కూడా ఇబ్బందిపడిన అమన్.. నేడు విదేశాల్లో తన కాళ్లపై తాను నిలబడింది. తన తల్లిదండ్రులు ఇకపై ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకూడదని, వారు తమ అవసరాల కోసం ఎవరి ముందు చేయి చాచకూడదని ఆమె కోరుకుంటోంది.
తల్లి అన్న ఒక్క మాటను అవమానంగా కాకుండా జీవిత లక్ష్యంగా మార్చుకుని, కష్టపడి ఈ స్థాయికి చేరుకున్న అమన్ ప్రయాణం ఇప్పుడు సోషల్ మీడియాలో పలువురిని ఆకట్టుకుంటోంది.

Leave a Reply