ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బహ్రైచ్ జిల్లా సుజౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈద్గా పుర్వా గ్రామంలో ఓ చిరుత ఇంట్లోకి చొరబడి 6 ఏళ్ల బాలికపై దాడి చేసిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఈ గ్రామంలో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బాలిక దివ్య ఇంట్లో మంచంపై దోమతెరలో ప్రశాంతంగా నిద్రపోతుండగా, గోడ దూకి లోపలికి వచ్చిన చిరుతపులి ఆమెను తన దవడలతో కరుచుకుంది. ఆ తర్వాత చిన్నారిని ఇంటి నుంచి బయటకు లాక్కెళ్లేందుకు ప్రయత్నించింది.
చిన్నారిని లాగుతున్న శబ్దం విని అకస్మాత్తుగా నిద్రలేచిన తల్లి, తన కూతురిని చిరుత కరుచుకోవడాన్ని చూసి షాక్‌కు గురైంది. కానీ, భయంతో అక్కడే ఉండిపోకుండా వెంటనే చిరుతతో పోరాడి కూతురిని దాని బారి నుంచి లాగి రక్షించేందుకు ప్రయత్నించింది. తల్లి కేకలు విన్న ఇరుగుపొరుగు వారు కూడా పరుగెత్తుకు వచ్చారు. దీంతో చిరుత చిన్నారిని వదిలేసి అక్కడి నుంచి పారిపోయింది. తల్లి చేసిన సాహసంతో ఆ చిన్నారి ప్రాణాలు దక్కాయి.
ఈ దాడిలో చిన్నారి మెడ, తల, చెవి, మరియు చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బాలికను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం బహ్రైచ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో బాలికకు తీవ్ర చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రాంతంలో చిరుత గ్రామంలోకి చొరబడటం ఇదే తొలిసారి కాదని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికే మూడుసార్లు చిరుత గ్రామంలోకి చొరబడి దాడులకు పాల్పడిందని, ఇంటి ముందు కట్టేసిన మేకలను కూడా ఎత్తుకెళ్లిందని చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించడంతో పాటు రాత్రి వేళల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.

Leave a Reply