మధ్యప్రదేశ్‌లోని మైహార్ జిల్లాలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులతో మరుగుదొడ్లు శుభ్రం చేయించిన ఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ వ్యవహారంపై అధికారులు విచారణ జరిపి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
ఆ వీడియోలో ఓ విద్యార్థిని చేతిలో వైపర్ పట్టుకుని నేలను శుభ్రం చేస్తుండగా, మరో విద్యార్థిని బకెట్‌తో నీళ్లు పోస్తూ కనిపించింది. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు అందించాల్సిన ఉపాధ్యాయులే.. వారి చేతుల్లో చీపుర్లు, శుభ్రం చేసే పరికరాలు పెట్టి మరుగుదొడ్లు కడిగించడం తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించడంతో జిల్లా కలెక్టర్ విధిషా ముఖర్జీ వెంటనే స్పందించారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
దీంతో అధికారులు పాఠశాలను సందర్శించి ప్రాథమిక విచారణ చేపట్టారు. ఈ విచారణలో ప్రధానోపాధ్యాయురాలు లీలా బాయి సింగ్ ఆదేశాల మేరకే విద్యార్థినులతో మరుగుదొడ్లు శుభ్రం చేయించినట్లు వెల్లడైంది.
అధికారుల విచారణ నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ మంగళవారం రాత్రి ప్రధానోపాధ్యాయురాలు లీలా బాయి సింగ్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం, పాఠశాల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ప్రవర్తించడంతో ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం.
ఇక ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల చేతుల్లో పుస్తకాలు పెట్టాల్సిన ఉపాధ్యాయులు.. వారితో ఇలాంటి పనులు చేయించడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు.
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన పాఠశాలల్లోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థుల గౌరవం, హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply