భారత్లో గత 2009 నుంచి 2026 మధ్య కాలంలో వివిధ ప్రమాదాలు, మానవ చర్యల కారణంగా మొత్తం 1,765 ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో అడవి ఏనుగుల మరణాలకు విద్యుదాఘాతమే ప్రధాన కారణంగా తేలింది. అక్రమ విద్యుత్ కంచెలు, విద్యుత్ తీగల వల్లే ఇప్పటివరకు 1,185 ఏనుగులు మృతి చెందడం వన్యప్రాణి ప్రేమికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
విద్యుదాఘాతం తర్వాత రైలు పట్టాలు దాటుతుండగా రైళ్లు ఢీకొని 277 ఏనుగులు, మనుషుల దురాశతో జరిపిన వేట కారణంగా 222 ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి. వీటితో పాటు విషప్రయోగం కారణంగా 81 ఏనుగులు మరణించినట్లు ఆ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అటవీ ప్రాంతాల ఆక్రమణ, తగిన రక్షణ లేకపోవడం వల్ల ఏనుగులకు వ్యతిరేకంగా రోజురోజుకూ నేరాలు పెరుగుతున్నాయని స్పష్టమవుతోంది.
రాష్ట్రాల వారీగా విడుదలైన జాబితా ప్రకారం.. ఒడిశాలో అత్యధికంగా 371 ఏనుగులు, అసోంలో 356, కర్ణాటకలో 223 ఏనుగులు ప్రాణాలు కోల్పోయి మొదటి స్థానాల్లో ఉన్నాయి. జాతీయ వారసత్వ జంతువుగా గౌరవించబడే ఏనుగులను రక్షించడానికి కఠినమైన చట్టాలు, భద్రతా చర్యలు అమలులో ఉన్నప్పటికీ, ఇలా వరుసగా జరుగుతున్న మరణాలు దేశంలోని వన్యప్రాణి సంరక్షణ వ్యవస్థను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

Leave a Reply