పంజాబ్ రాష్ట్రం లూధియానా జిల్లాలో రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉన్న ఓ యువకుడికి సాయం చేసేందుకు ఆగిన వారిపైకి వేగంగా వచ్చిన కాలేజీ బస్సు దూసుకెళ్లిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. మాచివారా – కోహారా రహదారిపై మద్యం మత్తులో ద్విచక్ర వాహనంతో కిందపడి ఉన్న యువకుడిని చూసిన కొందరు ప్రయాణికులు మానవత్వంతో వాహనాలు ఆపి సాయం చేసేందుకు ప్రయత్నించారు.
ఆ యువకుడిని రోడ్డు పక్కనే ఉన్న పెట్రోల్ బంకు వద్దకు సురక్షితంగా తీసుకెళ్లేందుకు వారు ప్రయత్నిస్తుండగా, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన పసుపు రంగు కాలేజీ బస్సు సాయం చేస్తున్న వారిని బలంగా ఢీకొట్టింది. ఈ భయానక ప్రమాద దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డై ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఘోర ప్రమాదంలో ఓ బాలుడు సహా నలుగురు గాయపడ్డారు. వీరిలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సు ఢీకొన్న వేగానికి అక్కడున్న ఓ వ్యక్తి తలపాగా దూరంగా ఎగిరిపడిందని, మెడ, వీపు, కాళ్లకు బలమైన దెబ్బలు తగిలాయని బాధితులు తమ భయానక అనుభవాన్ని పంచుకున్నారు.
బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, కావాలనే తమపైకి బస్సును ఎక్కించాడని బాధితులు ఆరోపించారు. అయితే, ప్రాథమిక విచారణలో డ్రైవర్ మద్యం సేవించలేదని, రోడ్డుపై నిలబడి ఉన్న వారిని గమనించకపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు వివరణ ఇచ్చారు.
ప్రమాదం తర్వాత గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, ఆదివారం కావడంతో వైద్యులు ఎవరూ లేరని, కేవలం ఇంజెక్షన్ మాత్రమే వేసి వేరే ఆసుపత్రికి పంపించేశారన్న ఆరోపణలు వచ్చాయి. మరోవైపు, ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply