సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే, కొన్ని చిన్న చిన్న సంఘటనలు మాత్రం మనసుకు హత్తుకోవడమే కాకుండా ముఖంపై చిరునవ్వు తెప్పిస్తాయి. అలాంటి ఓ ముద్దైన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఓ చిన్నారి తన బొమ్మ కారుకు పెట్రోల్ నింపించేందుకు ఏకంగా పెట్రోల్ బంక్‌కు వెళ్లాడు. అక్కడ బంక్ సిబ్బంది సరదాగా పెట్రోల్ నింపినట్లు నటించగా, ఆ తర్వాత ఆ చిన్నారి చేసిన పని అందరినీ ఆకట్టుకుంటోంది.
నాగాలాండ్ మంత్రి తెమ్జెన్ ఇమ్నా అలాంగ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. వీడియో ప్రారంభంలో ఆ చిన్నారి తన బొమ్మ కారును లాక్కుంటూ ఎంతో ధీమాగా పెట్రోల్ బంక్‌లోకి అడుగుపెడతాడు.
ఆ చిన్నారి ముఖంలో కనిపిస్తున్న ఉత్సాహం చూస్తుంటే తన బొమ్మ కారు ట్యాంక్‌ను పూర్తిగా నింపించుకోవాలనే పట్టుదలతో వచ్చినట్లు అనిపిస్తుంది. అతని ముద్దుముద్దు మాటలు, ఉత్సాహాన్ని చూసిన పెట్రోల్ బంక్ ఉద్యోగి కూడా అతని ఆటలో భాగమయ్యాడు. నిజంగానే పెట్రోల్ నింపుతున్నట్లుగా పైపును తీసుకుని బొమ్మ కారు దగ్గరకు తీసుకెళ్లి సరదాగా నటించాడు.
పెట్రోల్ నింపే సరదా ఆట పూర్తయిన తర్వాత ఆ చిన్నారి తన దగ్గర ఉన్న అసలైన డబ్బును తీసి ఉద్యోగికి ఇచ్చాడు. అయితే, చిన్నారి అమాయకత్వానికి మురిసిపోయిన ఉద్యోగి మొదట ఆ డబ్బులు తీసుకోవడానికి నిరాకరించాడు.
కానీ ఆ చిన్నారి మాత్రం పట్టువదలకుండా డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించాడు. దీంతో అతని మనసు నొప్పించకుండా ఉండేందుకు ఉద్యోగి చివరకు ఆ డబ్బులు తీసుకున్నాడు. ఆ తర్వాత ఏదో పెద్ద పని పూర్తి చేసినంత సంతోషంతో తన బొమ్మ కారును తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఈ వీడియో ఇప్పటికే 45 వేలకు పైగా వ్యూస్ సంపాదించినట్లు సమాచారం. చిన్నారి చూపించిన నిజాయితీ, అమాయకత్వంతో పాటు అతని ఆనందం కోసం ఉద్యోగి చూపించిన ప్రేమ, సహనంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిన్నారి వీడియో అందరి ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తోంది.

Leave a Reply